
బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా..? అయితే మీకో అలర్ట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటికి సంబంధించి కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ మేరకు 2026 జూలై 30న మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించిన ఆర్బీఐ.. బల్క్ డిపాజిట్ల వడ్డీ రేట్లపై కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. 2026 అక్టోబర్ 1 నుంచి ఈ నూతన రూల్స్ అమల్లోకి వస్తాయి.వాణిజ్య, స్మాల్ ఫైనాన్స్, ప్రాంతీయ గ్రామీణ, పేమెంట్. లోకల్ ఏరియ, పట్టణ సహకార బ్యాంకులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని ఆర్బీఐ పేర్కొంది. అసలు బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్ అంటే ఏమిటి? వీటి వడ్డీ రేట్ల విషయంలో ఆర్బీఐ చేసిన మార్పులేంటి? అనే విషయాలు తెలుసుకుందాం.
రూ.3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఒకేసారి చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను బల్క్ డిపాజిట్‌గా పేర్కొంటారు. ఎక్కువగా కంపెనీలు, సంస్థలు, ట్రస్టులు, అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు ఈ డిపాజిట్లు చేస్తుంటారు. ఈ విధానంలో డిపాజిట్ చేసేవారు వడ్డీ రేట్ల గురించి తమ బ్యాంకులతో చర్చలు జరుపుకునేవారు. బ్యాంకుతో తమకున్న సంబంధం, బేరసారాలను బట్టి వడ్డీ రేట్లను నిర్ణయించుకునేవారు. దీంతో ఒకేరోజు డిపాజిట్ చేసివారికి వేర్వేరు డిపాజిట్ రేట్లు ఉండేవి. అయితే తాజాగా ఆర్‌బిఐ మూడు ముఖ్యమైన మార్పులను ప్రవేశపెట్టింది. ఇక నుంచి బ్యాంకులు బల్క్ డిపాజిట్ వడ్డీ రేట్లను ప్రతిరోజు ఉదయం 10 గంటలలోపు తమ అధికారిక వెబ్‌సైట్లలో పొందుపర్చాల్సి ఉంటుంది. 10 నిమిషాల గ్రేస్ పీరియడ్ కూడా కల్పించారు. అంటే ఉదయం 10:10 గంటలకల్లా వడ్డీ రేట్లను వెబ్‌సైట్లో పొందుపర్చాలి.
బ్యాంకులు తమ వెబ్‌సైట్‌లో పొందుపర్చిన వడ్డీ రేటుకు భిన్నంగా ఇతర వడ్డీ రేట్లను నిర్ణయించకూడదు. అలాగే ఒకే డిపాజిట్ మొత్తానికి వేర్వేరు కస్టమర్లకు వేర్వేరు వడ్డీ రేట్లను అందించడానికి ఇక నుంచి కుదరదు. డిపాజిట్ చేసేవారు పాత కస్టమర్ అయినా, కొత్త క్లయింట్ అయినా లేదా ఒక పెద్ద కార్పొరేట్ అయినా అన్ని శాఖలలో వర్తించే రేటు ఒకే విధంగా ఉండాలి. ఇక లిక్విడిటీ కవరేజ్ రేషియో ఫ్రేమ్‌వర్క్ కింద ముందస్తు ఉపసంహరణ ప్రమాదం ఎక్కువగా ఉన్న బల్క్ డిపాజిట్లపై బ్యాంకులు అధిక వడ్డీ రేట్లను అందించవచ్చు. వడ్డీ రేట్లు ప్రతిరోజూ ఉదయం వెబ్ సైటుల్లో అందుబాటులో ఉంటాయి కాబట్టి.. డిపాజిటర్లు పెట్టుబడి పెట్టే ముందే చెక్ చేసుకోవచ్చు.ఒకవేళ బ్యాంకు తన వెబ్‌సైట్‌లో ప్రచురించిన రేటుకు భిన్నమైన రేటును అందిస్తే.. అది ఆర్‌బిఐ ఆదేశాలను ఉల్లంఘించినట్లే అవుతుంది.ఈ విషయాన్ని ఆర్‌బిఐ అంబుడ్స్‌మన్ ద్వారా పరిశీలించవచ్చు.