AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. మార్చి 1 నుంచి కొత్త యాప్.. అన్నీ ఒక్క చోటే..

రైలు ప్రయాణం అంటేనే ఒకప్పుడు క్యూ లైన్లు, గంటల తరబడి వేచి చూడటం.. కానీ టెక్నాలజీ వచ్చాక అన్నీ స్మార్ట్‌ఫోన్‌లోకి వచ్చేశాయి. అయితే ఇప్పటివరకు మనం అన్‌రిజర్వ్డ్ టిక్కెట్ల కోసం వాడుతున్న UTS యాప్‌కు రైల్వే శాఖ వీడ్కోలు పలకనుంది. అవును మీరు విన్నది నిజమే.. మార్చి 1 నుంచి UTS యాప్ దశలవారీగా కనుమరుగు కానుంది. దాని స్థానంలో సూపర్ యాప్ రాబోతోంది.

Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. మార్చి 1 నుంచి కొత్త యాప్.. అన్నీ ఒక్క చోటే..
Railone App Replace Uts App From March 1
Krishna S
|

Updated on: Feb 14, 2026 | 3:09 PM

Share

భారతీయ రైల్వే ప్రయాణీకులకు మరింత చేరువయ్యేందుకు వారి ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు ఒక కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు అన్‌రిజర్వడ్ టిక్కెట్ల కోసం వాడుతున్న UTS యాప్‌ను పక్కన పెట్టి దాని స్థానంలో అన్ని సేవలను ఒకే చోట అందించే రైల్‌వన్ యాప్‌ను పరిచయం చేస్తోంది. మార్చి 1 నుంచి UTS యాప్ సేవలు దశలవారీగా నిలిపివేస్తామని, ప్రయాణీకులు ఇకపై రైల్‌వన్ యాప్‌ను వినియోగించుకోవాలని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

రైల్‌వన్.. ప్రయాణీకుడికి ఆల్‌ ఇన్ వన్

ప్రస్తుతం రైల్వే టిక్కెట్లు, ప్లాట్‌ఫామ్ టిక్కెట్ల కోసం లేదా భోజనం ఆర్డర్ చేయడం కోసం వేర్వేరు యాప్‌లు వాడాల్సి వస్తోంది. కానీ రైల్‌వన్ ఒక అంబ్రెల్లా యాప్‌లా పనిచేస్తుంది. ఈ ఒక్క యాప్ ద్వారా ప్రయాణీకులు ఎన్నో ప్రయోజనాలు పొందుతారు.

అన్ని రకాల టిక్కెట్లు: రిజర్వ్డ్, అన్‌రిజర్వ్డ్, ప్లాట్‌ఫామ్, సీజన్ టిక్కెట్లను ఈ ఒక్క యాప్ ద్వారానే బుక్ చేసుకోవచ్చు.

లైవ్ స్టేటస్ – PNR ట్రాకింగ్: మీ రైలు ఎక్కడ ఉందో తెలుసుకోవడంతో పాటు వెయిట్‌లిస్ట్ టిక్కెట్ల PNR స్టేటస్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు. టిక్కెట్ రద్దు చేస్తే రీఫండ్ స్టేటస్‌ను కూడా ఇది చూపిస్తుంది.

సీటు వద్దకే ఆహారం: IRCTC ఆమోదించిన విక్రేతల ద్వారా మీకు నచ్చిన భోజనాన్ని ఆర్డర్ చేయవచ్చు. అది నేరుగా మీ కోచ్‌లోని మీ సీటు వద్దకే డెలివరీ చేయబడుతుంది.

కోచ్ పొజిషన్: స్టేషన్ లో రైలు రాకముందే మీ కోచ్ ఎక్కడ వస్తుందో తెలుసుకోవడం ద్వారా హడావిడి లేకుండా రైలు ఎక్కవచ్చు.

సురక్షిత చెల్లింపులు: యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్‌తో పాటు R-Wallet ద్వారా సులభంగా పేమెంట్స్ చేయవచ్చు.

ఫిర్యాదుల పరిష్కారం: ప్రయాణంలో ఏదైనా సమస్య ఎదురైతే రైల్‌మాడద్ ద్వారా వెంటనే ఫిర్యాదు చేసే సదుపాయం కూడా ఇందులో ఉంది.

మీ పాత బ్యాలెన్స్ భద్రం..

UTS యాప్‌ను తొలగిస్తున్న నేపథ్యంలో అందులోని R-Wallet బ్యాలెన్స్ గురించి ప్రయాణీకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దక్షిణ రైల్వే స్పష్టం చేసింది. మీ బ్యాలెన్స్ పూర్తిగా సురక్షితంగా ఉంటుందని, రైల్‌వన్ యాప్‌లోకి మారినప్పుడు అది ఆటోమేటిక్‌గా అందుబాటులోకి వస్తుందని హామీ ఇచ్చింది.

దశలవారీగా మార్పులు..

మార్చి 1 నుంచి పూర్తిస్థాయిలో అమలులోకి రానున్న నేపథ్యంలో ఇప్పటికే UTS యాప్‌లో కొత్త రిజిస్ట్రేషన్లు, సీజన్ టిక్కెట్ల పునరుద్ధరణను నిలిపివేశారు. ప్రయాణీకులు తమ పాత UTS లేదా IRCTC లాగిన్ వివరాలతోనే రైల్‌వన్ యాప్‌లోకి సులభంగా సైన్-ఇన్ అవ్వొచ్చు.

Follow Us