
ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇవ్వనుందని తెలుస్తోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌వో) ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్ అందించనుంది. పీఎఫ్ బ్యాలెన్స్ మొత్తంపై కేంద్ర ప్రభుత్వం వార్షిక వడ్డీ రేటును అందిస్తూ ఉంటుంది. కానీ ఈ సారి వడ్డీ రేటులో కేంద్రం కొత పెట్టనుందని తెలుస్తోంది. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీని ప్రకటించింది. కానీ 2025-26 ఆర్ధిక సంవత్సరానికి ఇంకా ఎంత వడ్డీ ఇస్తామనేది ప్రకటించలేదు. త్వరలోనే ఈ వడ్డీ రేట్లను ప్రకటించనుండగా.. ఈ సారి తగ్గించనుందని సమాచారం. త్వరలో జరగనున్న ట్రస్టీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే పీఎఫ్ అకౌంట్లు ఉన్నవారికి షాక్ అని చెప్పవచ్చు.
2025-26 ఆర్ధిక సంవత్సరానికి వడ్డీ రేటు 8 నుంచి 8.20 శాతంగా ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం వడ్డీ రేటు 8.25 శాతంగా ఉండగా.. ఇందులో కొత విధించనున్నారని సమాచారం. ఈపీఎఫ్‌వోకు సంబంధించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు వడ్డీ రేటును నిర్ణయిస్తూ ఉంటాయి. మార్చిలో ఈ ట్రస్టీల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వడ్డీ రేట్లను నిర్ణయించి కేంద్ర ఆర్ధిక శాఖ ఆమోదానికి పంపుతారు. ఆర్ధికశాఖ అనుమతి ఇచ్చిన అనంతరం ఈపీఎఫ్‌వో అధికారికంగా వడ్డీ రేట్ల గురించి ప్రకటన విడుదల చేస్తుంది.
నెలవారీ ప్రాతిపదికన ఈపీఎఫ్ వడ్డీను లెక్కిస్తారు. ప్రతీ ఆర్ధిక సంవత్సరం చివరిలో వీటిని జమ చేస్తారు. ఉదాహరణకు వార్షిక వడ్డీ రేటు 8.25 శాతంగా ఉంటే.. నెలవారీ రేటు సుమారు 0.688 శాతంగా ఉంటుంది. ఉద్యోగి బేసిక్ శాలరీ, డీఏలో 12 శాతం ఈపీఎఫ్‌కు జమ చేస్తారు. యజమాని వాటా 12 శాతం ఉంటుంది. ఇది రెండు భాగాలుగా విభజించబడింది. ఇందులో 8.33 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS)లో జమ చేస్తారు. ఇది నెలకు గరిష్టంగా రూ. 1,250 వరకు ఉంటుంది. ఇక మిగిలిన 3.67 శాతం ఈపీఎఫ్ ఖాతాకు జమ అవుతుంది. ఇప్పుడు వడ్డీ తగ్గించడం వల్ల పీఎఫ్ సేవింగ్స్‌పై వచ్చే వడ్డీ గత ఏడాది కంటే తక్కువగా వస్తుంది.
అటు ఏప్రిల్‌లో ఈపీఎఫ్‌వో కొత్త యాప్ రానుంది. ఈ యాప్‌లో యూపీఐ ద్వారా మనీ విత్ డ్రా చేసుకునే సౌకర్యంతో పాటు పాస్ బుక్ డీటైల్స్ చేసుకోవచ్చు. ఇక క్లెయిమ్స్ చాలా వేగంగా పరిష్కారం అవుతాయి. అలాగే ఉద్యోగులు ఫిర్యాదు చేయడానికి ఆప్షన్ ఉంటుంది. వేగంగా ఫిర్యాదులు పరిష్కరించేలా చర్యలు చేపడతారు. ఈ యాప్‌లో పీఎఫ్ సేవలు అన్నీ ఒకేచోట అందుబాటులో ఉండనున్నాియ.