
టెలికాం రీఛార్జ్ ధరల పెంపుతో బెంబేలెత్తుతున్న సామాన్య వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. టెలికాం కంపెనీల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ, కేవలం కాల్స్, ఎస్ఎంఎస్ మాత్రమే కోరుకునే వారి కోసం ప్రత్యేక ప్లాన్‌లను ప్రవేశపెట్టాలని ఆదేశించింది. ప్రస్తుతం అన్ని టెలికం కంపెనీలు ఇస్తున్న ప్లాన్‌లు ఎక్కువగా డేటా ఆధారితంగా ఉంటున్నాయి. దీనివల్ల ఇంటర్నెట్ వాడని వారు కూడా అదనపు డబ్బులు చెల్లించి విత్ డేటా ప్యాక్ ఉన్న రిచార్జ్ ప్లాన్‌లను తీసుకోవాల్సి వస్తుంది. కానీ ప్రస్తుతం TRAI తీసుకున్న ఈ నిర్ణయంతో, డేటా లేకుండా కేవలం కాల్స్, SMSలు ఇచ్చే తక్కువ ధర ప్లాన్‌లు అందుబాటులోకి రానున్నాయి.
టెలికాం కంపెనీలు కచ్చితంగా వాయిస్ కాల్స్, SMS సేవలకు మాత్రమే సంబంధించిన స్పెసిఫిక్ టారిఫ్ వోచర్‌లను ప్రవేశపెట్టాలని TRAI స్పష్టం చేసింది. వీటి ధరలు డేటాతో కూడిన ప్లాన్‌ల కంటే చాలా తక్కువగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే గతంలో ఇచ్చిన ఆదేశాలతో కొన్ని కంపెనీలు ఇలాంటి రీఛార్జ్ ప్లాన్‌లు తెచ్చినప్పటికీ వాటి ధరల్లో పెద్దగా మార్పులు ఏమి చేయలేదు. అంటే డేటా సౌకర్యాన్ని తొలగించినప్పటికీ కూడా సామాన్యులకు పెద్దగా లాభం చేకూరలేదు. దీని వల్ల కేవలం కపెనీలు మాత్రమే లాభపడ్డాయి.
ఇది గమనించిన TRAI, టెలికాం వినియోగదారుల రక్షణ 13వ సవరణ నిబంధనలు, 2026 పేరిట కొత్త ముసాయిదాను రూపొందించింది. ఈ నిబంధన ప్రకారం, ప్రతి టెలికాం సర్వీస్ ప్రొవైడర్ కనీసం ఒక కాల్, SMS ప్లాన్‌ను అందించడం తప్పనిసరి చేసింది. అలాగే ఈ తక్కువ ధర ప్లాన్‌లు కేవలం లాంగ్ వాలిడిటీతో మాత్రమే కాకుండా, తక్కువ రోజుల వాలిడిటీతో కూడా అందుబాటులో ఉండాలని ట్రాయ్ ఆదేశించింది.
ట్రాయ్ కొత్త రూల్స్ వల్ల కలిగే ప్రయోజనాలు
ట్రాయ్ తెచ్చిన ఈ కొత్త నిబంధనలతో సామాన్యులకు బిగ్ రిలీఫ్ దొరకనుంది. ఇది ఇంటర్నెట్ అవసరం లేని వృద్ధులకు, గ్రామీణ ప్రాంత వినియోగదారులకు ఇది ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు వినియోగదారులు తమకు నచ్చిన సేవలను మాత్రమే ఎంచుకునే అవకాశం లభిస్తుంది. అలాగే ఈ సవరణ టెలికాం మార్కెట్‌లో పారదర్శకతను పెంచి, ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహిస్తుంది. ఇది వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కొత్త రకాల ప్లాన్‌లతో ముందుకు రావాల్సిన పరిస్థితిని తీసుకొస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.