కార్లల్లో నెలకొన్న కొన్ని రకాల లోపాల కారణంగా కంపెనీలు వాహనాలు రీకాల్ చేస్తాయనే విషయం తెలిసిందే. వాహనదారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని కంపెనీలు ఈ నిర్ణయం తీసుకుంటాయి. మొన్నటి మొన్న కియా కంపెనీ సుమారు 70 వేలకిపైగా కార్లను రీకాల్ చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కియా కార్లలో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో కియా ఈ నిర్ణయం తీసుకుంది. కార్లలోని లోపాలను సరిచేసేందుకు కియా ఈ విషయాన్ని వెల్లడించింది.
ఇదిలా ఉంటే తాజాగా మరో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మారుతీ కూడా కార్లను రీకాల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ దేశీయ కార్ల తయారీ సంస్థ దాదాపు 9,925 కార్లను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. వేగనార్, సెలెరియో, ఇగ్నిస్‌కు చెందిన మోడళ్లలో కొన్ని కార్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు పేర్కొంది. వెనక బ్రేక్ అసెంబ్లీ పిన్‌లో లోపం ఉండే అవకాశం ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 2022 ఆగస్టు 3 నుంచి సెప్టెంబరు 1 మధ్య తయారైన కార్లలో లోపం ఉండే అవకాశం ఉందని మారుతీ తెలిపింది.
సదరు పిన్ విరిగిపోయి శబ్దం రావొచ్చని గుర్తించారు. ఇప్పటికిప్పుడు దీనివల్ల ఎలాంటి ఇబ్బంది కలగకపోయినా భవిష్యత్తులో దీర్ఘకాలంలో అది బ్రేక్ పనితీరుపై ప్రభావం చూపుతుందని కంపెనీ తెలిపింది. వాహనదారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా వాహనాలను పూర్తిగా చెక్ చేసి, లోపం ఉన్నట్లు గుర్తిస్తే సరిచేస్తామని కంపెనీలు ప్రతినిధులు తెలిపారు. ఇందుకోసం వినియోగదారులు అదనంగా ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, ఇందుకు కావాల్సిన పరికరాలను వర్క్‌షాప్‌లకు పంచించామని సంస్థ తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..