
కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపికబురు అందించింది. కిసాన్ క్రెడిట్ కార్డ్(KCC) పథకం ద్వారా రైతులకు అందిస్తున్న రుణ పరిమితిని మరింత పెంచింది. గతంలో ఈ పథకం ద్వారా రూ.3 లక్షల వరకు ఎలాంటి గ్యారంటీ లేకుండా అగ్రికల్చర్ లోన్లు బ్యాంకుల ద్వారా కేంద్రం అందించేది. అయితే రైతుల అవసరాలకు ఈ మొత్తం సరిపోవడం లేదనే ఉద్దేశంతో లోన్ లిమిట్‌ను 2025-26 బడ్జెట్‌లో మరింత పెంచింది. రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు దీనిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో రైతులు తమ అర్హతలను బట్టి రూ.5 లక్షల వరకు బ్యాంక్ నుంచి ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణం సులువుగా పొందవచ్చు. రూ.3 లక్షల వరకు ఉన్న స్వల్పకాలిక రుణాలపై వడ్డీలో సబ్సిడీ సదుపాయం కూడా కేంద్రం కల్పిస్తోంది.
రూ.3 లక్షల వరకు ఉన్న రుణాలపై వడ్డీపై 1.5 శాతం సబ్సిడీ సౌకర్యం కల్పిస్తోంది. ఇక ఈ రుణాలను సకాలంలో చెల్లిస్తే అదనంగా 3 శాతం రీపేమెంట్ ఇన్సెంటివ్ అందిస్తోంది. ఈ రుణాలకు వడ్డీ రేటు 7 శాతంగా ఉండగా.. ఏడాదిలోగా చెల్లిస్తే వడ్డీలో 3 శాతం రాయితీ పొందవచ్చు. దీంతో 4 శాతం వడ్డీ రేటుకు లోన్ పొందినట్లు అవుతుంది. ఈ రుణం పొందివారికి కిసాన్ రూపే కార్డులు బ్యాంకులు జారీ చేస్తాయి. దీని ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. ఒకసారి రుణ పరిమితి మంజూరు అయిన తర్వాత ఎప్పుడైనా నగదును రైతులు తీసుకోవచ్చు. 1998లో కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం ప్రారంభమైంది. అప్పటినుంచి ఇది కొనసాగుతూనే ఉంది. రైతులతో పాటు కౌలుదారులు, స్వయం సహాయక సంఘాలు ఈ రుణం పొందవచ్చు. రైతులే కాకుండా పశు పోషణ, వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలకు కూడా రుణ సదుపాయం ఉంది.
పలు బ్యాంకులు ఆన్‌లైన్ ద్వారా కిసాన్ క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ మేరకు బ్యాంకుల అధికారిక వెబ్ సైట్లలో లోన్ కేటగిరీ ఆప్షన్లలో కేసీసీ లోన్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఈ లోన్ పొందాలంటే సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉండాలి. దీంతో సేవింగ్స్ అకౌంట్ వివరాలతో పాటు మీ వ్యక్తిగత వివరాలు, భూమి, పంట వివరాలు అందించాలి. అనంతరం కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి. దరఖాస్తు సమర్పించిన తర్వాత బ్యాంకులు అర్హతలను పరిశీలించి లోన్ మంజూరు చేస్తాయి. నేరుగా మీ అకౌంట్లో వీటిని జమ చేస్తారు.