Credit Card: క్రెడిట్ కార్డులు వాడేవారికి కొత్త రూల్స్.. జూన్ 15 నుంచే అమల్లోకి.. ఈ విషయాలు తెలుసుకోండి..

క్రెడిట్ కార్డులు వాడేవారికి ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ షాకిచ్చింది. జూన్ 15వ తేదీ నుంచి కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. ఈ మేరకు అనేక లావాదేవీలకు సంబంధించిన ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ వెబ్ సైట్లో కొత్త నిబంధనలను పొందుపర్చింది.

Credit Card: క్రెడిట్ కార్డులు వాడేవారికి కొత్త రూల్స్.. జూన్ 15 నుంచే అమల్లోకి.. ఈ విషయాలు తెలుసుకోండి..
Credit Card

Updated on: Jun 11, 2026 | 7:02 PM

ఆర్ధిక అవసరాల కోసం ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. ఉద్యోగాలు, వ్యాపారులు చేసేవారిలో ఎక్కువ శాతం మంది వాడుతుండగా.. ఇక సామాన్య వ్యక్తులు కూడా విరివిగా వినియోగిస్తున్నారు. గతంలో పోలిస్తే ఇటీవల కాలంలో దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వినియోగం పెరుగుతున్న క్రమంలో క్రెడిట్ కార్డులు జారీ చేసే సంస్థలు పలు బెనిఫిట్స్‌ను తగ్గిస్తున్నాయి. ఉచిత ఎయిర్ పోర్ట్ లాంజ్ సౌకర్యం, రివార్డ్ పాయింట్లలో కొత, డిస్కౌంట్స్ తొలగింపు వంటి వాటిల్లో మార్పులు చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో బ్యాంక్ క్రెడిట్ కార్డుల విషయంలో కీలక మార్పులు చేసింది.

జూన్ 15 నుంచి కొత్త రూల్స్..

ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఇండస్ ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డు నిబంధనల్లో మార్పులు చేసింది. రవాణా ఛార్జీలు, ఇంధన లావాదేవీలు, అంతర్జాతీయ ఖర్చుల వంటి ఛార్జీలలో మార్పులతో పాటు వడ్డీ లెక్కింపులో రూల్స్ మార్చింది. ప్రతీ స్టేట్‌మెంట్ సైకిల్‌లో రూ.40 వేలు దాటిన రవాణా ఖర్చులపై 1 శాతం ఛార్జీతో పాటు జీఎస్టీ విధించనుంది. అయితే విమాన ప్రయాణాలకు ఈ నిబంధన వర్తించదు. అలాగే పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన కొనుగోళ్లపై విధించే ఛార్జీలలో సవరణలు చేసింది. ప్రస్తుతం రూ.50 వేలు పైబడి లిమిట్ దాటితే ఇంధన కొనుగోళ్లకు ఛార్జీలు వసూలు చేస్తుండగా.. ఇప్పుడు రూ.30 వేలకు తగ్గించనుంది. ఇక నుంచి రూ.30 వేలు దాటితే 1 శాతం ఛార్జీతో పాటు జీఎస్టీ ఉంటుంది.

ఛార్జీలు పెంపు

ఇక అంతర్జాతీయ ఖర్చులపై విధించే బ్యాంక్ డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ ఛార్జీలను కూడా సవరించింది. ఇప్పటినుంచి ఈ లాదాదేవీలకు 2 శాతం ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఇక క్రెడిట్ కార్డులకు సంబంధించి వడ్డీ లెక్కింపు విషయంలో కూడా మార్పులు చేసింది. ఇక నుంచి పాక్షిక చెల్లింపులు చేస్తూ గడువు తేదీన లేదా అంతకంటే ముందు చెల్లించిన పక్షంలో చెల్లింపు డేట్ నుంచి మునుపటి స్టేట్ మెంట్ ముగింపు బ్యాలెన్స్ పై వడ్డీ జమ అవుతుంది. ఈ వడ్డీని రాబోయే స్టేట్ మెంట్‌లో యాడ్ చేస్తారు. రాబోయే స్టేట్‌మెంట్‌లో పూర్తిగా చెల్లిస్తేనే వడ్డీ రహిత కాలం ప్రయోజనం పొందే అవకాశముంటుంది. బ్యాంక్ వెబ్ సైట్లోకి వెళ్లి సవరించిన నిబంధనలు గమనించాలని ఇండస్ఇండ్ బ్యాంక్ తెలిపింది. ఈ మేరకు కస్టమర్లకు సూచనలు చేసింది. మరో మూడు రోజుల్లో ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీంతో ఇండస్ ఇండ్ క్రెడిట్ కార్డులు వాడేవారు తెలుసుకోండి.

Follow Us