
దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐటీ రంగం మళ్లీ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఏడాది అత్యంత వెనుకబడిన రంగాల్లో ఒకటిగా నిలిచిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాక్స్‌లో ఇటీవల బలమైన కొనుగోళ్లు నమోదవుతున్నాయి. సోమవారం వరుసగా మూడో ట్రేడింగ్ సెషన్‌లో కూడా ఐటీ షేర్లు ర్యాలీ కొనసాగించడంతో నిఫ్టీ ఐటీ సూచీ 2.8 శాతం పెరిగి 30,680.75 పాయింట్ల వద్ద ముగిసింది. గత మూడు సెషన్లలో ఈ సూచీ మొత్తం 5.8 శాతం లాభపడటం గమనార్హం. ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఇన్ఫోసిస్ 4.42 శాతం పెరిగి ర్యాలీలో నంబర్ వన్ గా నిలవగా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 3.52 శాతం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 2.33 శాతం, టెక్ మహీంద్రా 1.70 శాతం లాభపడ్డాయి. అలాగే కోఫోర్జ్, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, ఎంఫసిస్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, విప్రో వంటి కంపెనీల షేర్లు కూడా లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఈ స్టాక్స్‌లో నమోదైన బలం సెన్సెక్స్‌కు కీలక మద్దతుగా నిలిచింది.
ఐటీ స్టాక్స్‌లో తాజా ర్యాలీకి ప్రధాన కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యయంపై పెరుగుతున్న ఆశావాదాన్ని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికాకు చెందిన క్లౌడ్ సాఫ్ట్‌వేర్ సంస్థ స్నోఫ్లేక్ అంచనాలను మించిన త్రైమాసిక ఫలితాలను ప్రకటించడంతో ప్రపంచ టెక్నాలజీ రంగంపై సానుకూల సంకేతాలు వెలువడ్డాయి. క్లౌడ్ సేవలు, డేటా మేనేజ్‌మెంట్, ఏఐ ఆధారిత ప్రాజెక్టులపై సంస్థలు పెట్టుబడులు కొనసాగిస్తున్నాయనే సంకేతాలు పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచాయి. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది చివర్లో వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలు కూడా టెక్నాలజీ షేర్లకు మద్దతునిస్తున్నాయి. సాధారణంగా తక్కువ వడ్డీ రేట్లు టెక్ కంపెనీల భవిష్యత్ ఆదాయాల విలువను పెంచుతాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా టెక్ స్టాక్స్‌లో పెట్టుబడులు పెరుగుతున్నాయి.
ఇక రూపాయి బలహీనత కూడా భారతీయ ఐటీ కంపెనీలకు అనుకూలంగా మారింది. ఈ సంస్థలు తమ ఆదాయంలో పెద్ద భాగాన్ని డాలర్ల రూపంలో సంపాదిస్తాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం వల్ల వారి విదేశీ ఆదాయం రూపాయిల్లో ఎక్కువగా మారి లాభదాయకతను పెంచుతుంది. గత ఏడాది కాలంలో ఐటీ రంగం భారీ దిద్దుబాటును ఎదుర్కొనడంతో ప్రస్తుతం వాల్యుయేషన్లు కూడా ఆకర్షణీయ స్థాయికి చేరాయి. దీంతో ఏఐ వ్యయం, వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలు, కరెన్సీ ప్రయోజనాలు కలిసి ఐటీ రంగంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి