రూ. 10 కాయిన్ ఇస్తే ఇప్పటికీ తీసుకోవడానికి వెనుకడుగు వేసే వారు చాలా మంది ఉన్నారు. కాయిన్ చెల్లదంటూ ఓ ప్రచారం జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఈ కాయిన్‌కు చెల్లదని ఆర్బీఐ అధికారికంగా ఎప్పుడూ ప్రకటించలేదు. అయితే ప్రజల్లో మాత్రం ఓ అపోహ మాత్రం ఉంటోంది. అయితే రూ. 10 కాయిన్ తీసుకోవడాన్ని నిరాకరిస్తే నేరంగా పరిగణించాలని ఇప్పటికే ఆర్బీఐ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే తాజాగా రూ. 10 నాణేలపై ఇండియన్ బ్యాంక్ అవగాహణ కార్యక్రమం చేపట్టింది. ఈ కాయిన్స్ చట్టబద్ధమైనవని, వీటిని రోజువారీ లావాదేవీలకు ఉపయోగించవచ్చని ఇండియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. వీటి చలామణిని వ్యాపార లావాదేవీలకు ఉపయోగించాలని , ఆర్బీఐ ఉత్తర్వుల మేరకు విస్తృత అవగాహన కల్పించేందుకు ఇండియన్ బ్యాంక్ చర్యలు చేపడుతోందని చెప్పుకొచ్చారు.
ఇందులో భాగంగానే ఇటీవల హైదరాబాద్ హిమాయత్ నగర్ బ్రాంచ్ వద్ద 10 రూపాయల నాణేలు చలామణిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తమ ఖాతాదారులకు 10 రూపాయల నాణేలు వినియోగించాలని సూచిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ఈ నాణేలు చెల్లబాటు అవుతున్నాయని తెలిపారు. కాగా ఈ సందర్భంగా పలువురు ఖాతాదారులు ఈ నాణేలను జీఎం చేతుల మీదుగా అందుకున్నారు. దీంతో రూ. 10 నాణేంపై జరుగుతోన్న అపోహలకు చెక్ పెట్టినట్లు అయ్యింది.
ఇదిలా ఉంటే ఇప్పటికీ చాలా మంది రూ. 10 నాణేలను తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వీటిపై సరైన అవగాహన ఉండడం లేదు. దీంతో ఈ కాయిన్స్ చెల్లవన్న అనుమానంతో తీసుకోవడం లేదు. ఈ కారణంగా ఈ నాణేల రొటేషన్ మార్కెట్లో భారీగా తగ్గిపోయింది. అదే విధంగా మార్కెట్లో రూ. 10 నోట్ల కొరత కూడా ఏర్పడినట్లు తెలుస్తోంది. నోట్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కాయిన్స్ పై అవగాహన పెంచుతున్నట్లు స్పష్టమవుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..