ఇలా చేశారో ఏకంగా 200 శాతం జరిమానా తప్పదు! ఐటీఆర్‌లో అంతా మారిపోయింది!

ఆదాయపు పన్ను శాఖ అధిక ఆదాయపు పన్ను చెల్లింపుదారులపై (₹50 లక్షలు+) తగ్గింపులు, మినహాయింపుల క్లెయిమ్‌లపై దృష్టి సారించింది. అధునాతన సాంకేతికతతో ITR వివరాలను క్రాస్-వెరిఫై చేస్తూ, తప్పుడు క్లెయిమ్‌లకు భారీ నోటీసులు, జరిమానాలు విధిస్తోంది. చిన్న పొరపాట్లు సైతం పెద్ద ఆర్థిక భారం మోపుతున్నాయి. ITR-Uతో అదనపు పన్ను భారం పడుతుందని హెచ్చరిస్తున్నారు.

ఇలా చేశారో ఏకంగా 200 శాతం జరిమానా తప్పదు! ఐటీఆర్‌లో అంతా మారిపోయింది!

Updated on: Feb 23, 2026 | 4:15 AM

సంవత్సరానికి రూ.50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న పన్ను చెల్లింపుదారులపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి మరింత కేంద్రీకృతమైంది. తగ్గింపులు, మినహాయింపుల క్లెయిమ్‌లలో వ్యత్యాసాలు గుర్తించిన నేపథ్యంలో భారీగా నోటీసులు జారీ చేస్తున్నట్లు సమాచారం. TaxBuddy వెల్లడించిన ఒక ఉదాహరణలో ఓ పన్ను చెల్లింపుదారు రూ.10.65 లక్షల మేర తప్పుగా మినహాయింపు క్లెయిమ్ చేసినట్టు గుర్తించారు. దీని ఫలితంగా అతనిపై రూ.3.14 లక్షల అదనపు పన్నుతో పాటు 200 శాతం జరిమానా కింద రూ.6.29 లక్షలు విధించారు. మొత్తంగా అతనికి రూ.9.44 లక్షల ఆర్థిక భారం పడింది.

ఇటీవలి కాలంలో పన్ను శాఖ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఆటోమేటెడ్ డేటా విశ్లేషణ వ్యవస్థలను విస్తృతంగా వినియోగిస్తోంది. పన్ను చెల్లింపుదారుల ITR వివరాలను ఫారమ్-16, కంపెనీలు సమర్పించిన సమాచారం, బ్యాంక్ లావాదేవీలు తదితర ఆర్థిక డేటాతో క్రాస్-వెరిఫికేషన్ చేస్తున్నారు. గతంలో గుర్తించబడకుండా మిగిలిపోయిన చిన్న పొరపాట్లు కూడా ఇప్పుడు తక్షణమే బయటపడుతున్నాయి. పన్ను బేస్‌ను విస్తరించడం, నివేదికల కచ్చితత్వాన్ని పెంచడం ప్రభుత్వ లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో తగ్గింపులు క్లెయిమ్ చేసిన వారు తమ రిటర్న్‌లను ఒకసారి తిరిగి పరిశీలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఫారమ్-16, HRA రసీదులు, LTA వివరాలు, సెక్షన్ 80C పెట్టుబడులు, సెక్షన్ 80D బీమా రుజువులు సరిపోలుతున్నాయో లేదో చూసుకోవాలని అంటున్నారు. లోపాలు ఉన్నట్లు తేలితే, గడువు లోపల సవరించిన రిటర్న్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఆ గడువు దాటితే Updated Return (ITR-U) ద్వారా అసెస్‌మెంట్ సంవత్సరం ముగిసిన 48 నెలల వరకు సరిదిద్దుకోవచ్చు. అయితే ITR-U దాఖలు చేస్తే అదనపు పన్ను భారం పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పన్ను తగ్గించుకోవడానికి లేదా అధిక రీఫండ్ కోసం ITR-U ఉపయోగించలేమని స్పష్టం చేస్తున్నారు. డేటా ఆధారిత పన్ను పర్యవేక్షణ పెరిగిన నేపథ్యంలో నోటీసు కోసం వేచి ఉండకుండా ముందుగానే రిటర్న్‌లను తనిఖీ చేసి సరిచేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే చిన్న పొరపాటు కూడా పెద్ద ఆర్థిక నష్టానికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us