
హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ బల్లెట్ రైలు కారిడార్‌పై మరో బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ ప్రాజెక్ట్ ఎలైన్‌మెంట్‌లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. తెలంగాణ ప్రభుత్వం అలైన్‌మెంట్ మార్చాలని కేంద్రానికి విజ్ఞప్తులు పంపింది. ఇంతకముందు నిర్ణయించిన రూట్ కాకుండా వేరే రూటు మార్చాలని వినతులు పంపింది. ఈ డిమాండ్ మేరకు అలైన్‌మెంట్‌లో మార్పులకు శ్రీకారం చుట్టింది నేషనల్ హైస్పీడ్ రైల్ కారిడార్ సంస్థ. గతంలో సూర్యాపేట, ఖమ్మం మీదుగా అలైన్‌మెంట్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఆ రూట్ కాకుండా వేరే రూట్‌కు మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు.
కొత్త అలైన్‌మెంట్ ప్రకారం.. శంషాబాద్ నుంచి భారత్ సిటీ, హాలియా, డ్రైపోర్ట్, వాడపల్లి మీదుగా ఈ హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్ వెళ్లనుంది. దీంతో ప్రాజెక్ట్ దూరం కూడా భారీగా తగ్గింది. గత మార్గం ప్రకారం తెలంగాణలో ఈ హైస్పీడ్ రైలు కారిడార్ దూరం 236 కిలోమీటర్లుగా ఉండగా.. ఇప్పుడు 123 కిలోమీటర్లకు తగ్గించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ రూట్లో సర్వే పనులు వేగంగా జ రుగుతున్నాయి. డ్రైపోర్ట్ స్టేషన్ మీదుగా వెళ్లడం వల్ల సరుకు రవాణా, ఎగుమతులకు వీలుగా ఉంటుంది. రూట్ ఛేంజ్ చేయడంతో తెలంగాణలో దూరం సగానికి సగం తగ్గినట్లయింది. ఆర్ధిక, భౌగోళిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు చేశారు.
పాత రూట్ ప్రకారం శంషాబాద్‌లో హైస్పీడ్ రైలు కారిడార్ ప్రారంభమై.. బాటసింగారం, నార్కట్ పల్లి, సూర్యాపేట, ఖమ్మం మీదుగా ఏపీలోకి వెళుతుంది. ఇందుకు 790 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి వచ్చేది. కానీ ప్రాజెక్ట్ దూరం తగ్గడంతో భూసేకరణకు కూడా ఇబ్బందులు తగ్గనున్నాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ హైస్పీడ్ రైల్ కారిడార్ సంస్థ సమాచారం పంపింది. ఈ రూట్లో మొత్తం నాలుగు స్టేషన్లను నిర్మించనున్నారు. భారత్ సిటీ, డ్రైపోర్ట్, హాలియా, వాడపల్లిలో స్టేషన్లను ఉండనున్నాయని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం డ్రైపోర్ట్ ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఇక్కడ బుల్లెట్ ట్రైన్ రావడం వల్ల సరుకు రవాణాలో మరింత వేగం పెరుగుతుంది. రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల పోర్టులకు సరుకు రవాణా మెరుగుపడుతుంది.