
ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ వాషింగ్ మెషీన్ ఒక అత్యవసర వస్తువుగా మారిపోయింది. అయితే కొత్తగా వాషింగ్ మెషీన్ కొనాలని షాపుకో లేదా ఆన్‌లైన్ సైట్లకో వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరినీ వేధించే ఏకైక ప్రశ్న.. ఫ్రంట్ లోడ్ మెషీన్ కొనాలా? లేక టాప్ లోడ్ మెషీన్ కొనాలా?. రెండు చూడటానికి అద్భుతంగానే కనిపిస్తాయి, కంపెనీలు కూడా తమ మోడళ్లే బెస్ట్ అని కలరింగ్ ఇస్తాయి. కానీ కేవలం డిజైన్ లేదా ఆఫర్ల ధర చూసి కొంటే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ రెండింటి మధ్య కేవలం బట్టలు వేసే విధానంలోనే కాదు.. క్లీనింగ్, నీరు, కరెంట్ వినియోగంలోనూ చాలా తేడాలు ఉన్నాయి. వాషింగ్ మెషీన్ కొనేటప్పుడు మన అవసరాలు, బడ్జెట్. ఇంటి రకాన్ని బట్టి సరైన దాన్ని ఎంచుకోవాలి.
ఈ మెషీన్లలో బట్టలను ముందు వైపు ఉన్న డోర్ ద్వారా లోడ్ చేస్తారు. ఇవి బట్టలను ఉతకడానికి డ్రమ్‌ను గుండ్రంగా తిప్పుతాయి. దీనివల్ల బట్టలు చాలా లోతుగా, నీట్‌గా క్లీన్ అవుతాయి. ఇందులో నీరు, డిటర్జెంట్ చాలా తక్కువగా ఖర్చవుతాయి. అలాగే ఖరీదైన, సున్నితమైన దుస్తులు పాడవకుండా ఇవి బాగా కేర్ తీసుకుంటాయి. అయితే ఇవి టాప్ లోడ్ మెషీన్ల కంటే ధర చాలా ఎక్కువ. అంతేకాకుండా బట్టలు వేయాలన్నా, తీయాలన్నా కిందకు వంగవలసి ఉంటుంది. నడుము నొప్పి ఉన్నవారికి లేదా ఇంట్లోని వృద్ధులకు ఇది కొంత కష్టంగా అనిపించవచ్చు.
భారతదేశంలో మెజారిటీ ఇళ్లలో ఈ రకమైన మెషీన్లనే ఎక్కువగా ఇష్టపడతారు. ఇందులో బట్టలను పైనుంచి లోడ్ చేస్తారు. వీటి ధర అందరికీ అందుబాటులో ఉంటుంది. నిలబడే బట్టలు వేయవచ్చు, తీయవచ్చు కాబట్టి వాడకం చాలా ఈజీ. వీటి వాష్ సైకిల్స్ చాలా త్వరగా పూర్తవుతాయి, తద్వారా సమయం ఆదా అవుతుంది. ఉతికే మధ్యలో కూడా అదనపు బట్టలను యాడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇవి ఫ్రంట్ లోడ్ అంత పవర్‌ఫుల్‌గా బట్టలను క్లీన్ చేయలేవు. అంతేకాకుండా వీటికి నీటి వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది.
పొదుపు విషయానికి వస్తే ఖచ్చితంగా ఫ్రంట్ లోడ్ మెషీన్లదే పైచేయి. ఇవి తక్కువ నీటితోనే బట్టలను అద్భుతంగా క్లీన్ చేయగలవు. డిటర్జెంట్ కూడా తక్కువ పడుతుంది. అయితే రోజుకు నాలుగైదు సార్లు బట్టలు ఉతకాల్సి వచ్చే పెద్ద కుటుంబాలు ఉన్నచోట, వేగంగా పనవ్వడం కోసం టాప్ లోడ్ మెషీన్లు ఎక్కువ ప్రాక్టికల్‌గా ఉపయోగపడతాయి.
మీకు బెస్ట్ క్లీనింగ్ కావాలి, నీటి కొరత ఉంది, బట్టలు ఎక్కువ కాలం మన్నికగా ఉండాలి అనుకుంటే.. బడ్జెట్ కొంచెం ఎక్కువైనా ఫ్రంట్ లోడ్ మెషీన్ బెస్ట్ ఛాయిస్. మీ బడ్జెట్ లిమిటెడ్‌గా ఉండి, వంగే పని లేకుండా ఈజీగా, ఫాస్ట్‌గా వాషింగ్ అయిపోవాలి అనుకుంటే.. టాప్-లోడ్ మెషీన్ పక్కాగా సెట్ అవుతుంది. కేవలం బ్రాండ్, ఆఫర్లు చూసి కాకుండా.. మీ ఇంట్లో ఉండే నీటి సదుపాయం, మీ ఫ్యామిలీ సైజును బట్టి వాషింగ్ మెషీన్ కెపాసిటీని ఎంచుకోవడం ఎల్లప్పుడూ ఉత్తమం.