Star Link Internet: ఇండియాలో స్టార్ లింక్ ఇంటర్నెట్ ధరలు ఖరారు.. నెలకు ఎంతో తెలిస్తే షాక్..!

ఇండియాలో త్వరలో రానున్న స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ధరలు ఖరారు అయ్యాయి. ఈ మేరకు ప్లాన్ వివరాలను స్టార్ లింక్ తన ఇండియా వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. నెలకు ఎంత చెల్లించాలనే వివరాలను అధికారికంగా ప్రకటించింది. ప్లాన్ ధరలు చాలా అధికంగా ఉన్నాయి. ఎంతంటే..?

Star Link Internet: ఇండియాలో స్టార్ లింక్ ఇంటర్నెట్ ధరలు ఖరారు.. నెలకు ఎంతో తెలిస్తే షాక్..!
భారతదేశంలో ప్రారంభించటానికి స్టార్‌లింక్ దాదాపు అన్ని అవసరమైన ప్రభుత్వ అనుమతులను పొందింది. ప్రస్తుతం, కంపెనీ SATCOM ఆమోదం, స్పెక్ట్రమ్ కేటాయింపు కోసం వేచి ఉంది. నివేదికల ప్రకారం.. ఈ రెండు ప్రక్రియలు 2025 చివరి నాటికి పూర్తవుతాయని భావిస్తున్నారు. స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవను దేశంలో జనవరి లేదా ఫిబ్రవరి 2026లో ప్రారంభించవచ్చు.

Updated on: Dec 08, 2025 | 5:49 PM

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రపంచవ్యాప్తంగా తమ శాటిలైట్ ఇంటర్నెట్ స్టార్ లింక్ సేవలను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో సేవలను ప్రారంభించగా.. త్వరలో భారత్‌లో కూడా లాంచ్ చేయనున్నారు. కొత్త ఏడాది ప్రారంభంలో ఇండియాలో సేవలు అందబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. ఈ లోపు దేశంలోని అనేక సిటీల్లో గ్రౌండ్ స్టేషన్లను స్టార్ లింక్ సిద్దం చేసుకుంటోంది. సిగ్నల్స్‌ను మెరుగుపర్చి వేగవంతైన ఇంటర్నెట్ అందించేందుకు ఇవి సహాయపడతాయి. ఇంటర్నెట్ లేని గ్రామాల్లో స్టార్ లింక్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ఈ నెలలోనే ఎలాన్ మస్క్ ప్రకటించారు. హోమ్ బ్రాడ్‌బ్యాండ్ అంతరాయం కలిగి ఉన్న రాష్ట్రాల్లో తొలుత తీసుకురావాలని ప్రణాళికలు సిద్దం చేశారు.

స్టార్ లింక్ ఇంటర్నెట్ ధరలు

తాజాగా స్టార్ లింక్ తన వెబ్‌సైట్‌లో ఇండియాలో తమ ధరలను పొందుపర్చింది. దీని ప్రకారం రెసిడెన్షియల్ ప్లాన్ నెలకు రూ.8,600గా నిర్ణయించారు. ఇక యాంటీనా, రౌటర్ కిట్‌, వన్ టైమ్ హార్డ్‌వేర్ ఖర్చు రూ.34 వేలుగా ఉంది. స్పేస్ ఎక్స్ ఉపగ్రహ నెట్‌వర్క్‌కి అనుసంధానం కావడానికి హార్డ్ వేర్ అవసరమని స్టార్ లింక్ చెబుతోంది. అలాగే ఆన్‌లిమిటెడ్ ఇంటర్నెట్‌తో 30 రోజులు ట్రయల్ పీరియడ్ ఇవ్వనున్నారు. ఒకవేళ కనెక్టివిటీ పట్ల మీరు సంతోషంగా లేకపోతే బయటకి రావచ్చు.

బిజినెస్ ప్లాన్ ధరలు..?

ఇక వ్యాపారుల కోసం అందించే ఇంటర్నెట్ సర్వీస్ ధరలను స్టార్ లింక్ ఇంకా వెల్లడించలేదు. నియంత్రణ అనుమతులు, రోల్ అవుట్ ప్లాన్లపై చర్చించిన తర్వాత ధరలను నిర్ణయించనున్నారు. ఇతర దేశాల్లో బిజినెస్ ప్యాకేజీలు అధిక వేగాన్ని కలిగి ఉన్నాయి. మారుమూల ప్రాంతాల్లోని కంపెనీలు, పరిశ్రమలకు ఈ ఇంటర్నెట్ ఉపయోగపడే అవకాశముంది.

గ్రామాలు టార్గెట్..?

అసలు ఇంటర్నెట్ సౌకర్యం లేని మారుమూల గ్రామాలను స్టార్ లింక్ టార్గెట్ చేసింది. గ్రామాల్లోని గృహాలు, చిన్న వ్యాపారుల లక్ష్యంగా ముందుకెళ్లనుంది. బ్రాడ్‌బ్యాండ్, ఫైబర్ నెట్‌వర్క్ కనెక్షన్లలో ఇబ్బంది పడుతున్న ప్రాంతాలపై దృష్టి పెట్టనుంది. కొండ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, హైవే పట్టణాలలోని కుటుంబాలకు చేరువ చేసేలా ప్రణాలికలు సిద్దం చేసింది స్టార్ లింక్. అయితే స్టార్ లింక్ ఇంటర్నెట్ ధరలు అధికంగా ఉండటంతో ఇండియాలో స్పందన ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది.