Election Commission: ఆధార్‌తో ఓటరు కార్డు అనుసంధానం.. ఈసీ కీలక ప్రకటన..

|

Mar 18, 2025 | 9:04 PM

ఎన్నికల ప్రక్రియ బలోపేతంపై ఇప్పటికే రాజకీయ పార్టీల సూచనలు కోరిన కేంద్ర ఎన్నికల సంఘం.. మరో కీలక ప్రకటన చేసింది. ఓటర్‌ ఐడీతో ఆధార్‌ లింక్‌పై త్వరలోనే చర్చలు మొదలవుతాయని స్పష్టం చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. అదేంటంటే ఇప్పుడు చూద్దాం..

Election Commission: ఆధార్‌తో ఓటరు కార్డు అనుసంధానం.. ఈసీ కీలక ప్రకటన..
Follow us on

త్వరలోనే ఓటర్‌ ఐడీతో ఆధార్‌ను అనుసంధించనున్నారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అత్యున్నతస్థాయి సమావేశం జరిగింది. ఓటర్‌ ఐడీ, ఆధార్‌ అనుసంధానంపై ఢిల్లీలో జరిగిన సమావేశంలో చర్చించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలో ఈసీలు డాక్టర్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, డాక్టర్‌ వివేక్‌ జోషీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి, యూఐడీఏఐ సీఈవో, ఎన్నికల కమిషన్ సాంకేతిక నిపుణులతో సమావేశం నిర్వహించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 326 ప్రకారం.. భారతీయ పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుందని.. ఓటర్ల గుర్తింపు కార్డుని ఆధార్‌తో అనుసంధానించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం-1950, 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఈ విషయంలో మరింత చర్చలు జరపాలని.. సాంకేతిక అంశాలపై త్వరలో UIDAI అధికారులతో సంప్రదింపులు చేయనున్నట్లు ఈసీ స్పష్టం చేసింది.

ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితాలపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న క్రమంలో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రక్రియ బలోపేతంపై సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించింది. ఎన్నికల రిజిస్ట్రేషన్‌ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్ల స్థాయిల్లో ఏవైనా పరిష్కారం కాని సమస్యలపై ఏప్రిల్‌ 30 నాటికి అన్ని జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీల నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నట్లు ఈసీ తెలిపింది.