Telugu News Business Come babu come, buy flight tickets, companies that have announced huge discounts, Diwali flight sale details in telugu
Diwali flight sale: రండి బాబూ రండి.. విమాన టిక్కెట్లు కొనండి.. భారీ డిస్కౌంట్లు ప్రకటించిన కంపెనీలు
భారతీయులందరూ ఎంతో ఇష్టంగా జరుపుకొనే దీపావళి పండగ వచ్చేస్తోంది. వెలుగుల పండగను ఉత్సాహంగా జరుపుకొనేందుకు ప్రజలందరూ సిద్ధమవుతున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాల కోసం ఎక్కడెక్కడో స్థిర పడిన వారందరూ సొంతింటికి రానున్నారు. ఈ సందర్భంగా వారికి దుస్తులు, ఇతర వస్తువులను కొనుగోలు చేసేందుకు పెద్దలందరూ బిజీగా షాపింగ్ చేస్తున్నారు. మార్కెట్ అంతా వివిధ రకాల డిస్కౌంట్లు, ఆఫర్లలో సందడిగా మారింది. ఈ నేపథ్యంలో ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కూడా టిక్కెట్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. పండగకు వచ్చే ప్రయాణికుల కోసం ఈ ఆఫర్ తీసుకువచ్చింది. ఎయిర్ ఇండియా ఇస్తున్న తగ్గింపు ధరలు ఇలా ఉన్నాయి.
దీపావళి ఫ్లైట్ సేల్ విభాగంలోకి ఎయిర్ ఇండియా వచ్చింది. పండగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం విమాన టికెట్లపై తగ్గింపులు అందజేస్తోంది. కస్టమర్లను ఆకర్షించడం, తోటి విమానయాన సంస్థ పోటీని తట్టుకోవడానికి ఈ చర్యలు తీసుకుంది. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం దీపావళికి విమాన టిక్కెట్ల ధరలు 20 నుంచి 25 శాతం తగ్గాయని నివేదికలు చెబుతున్నాయి. ఎయిర్స్ లైన్స్ సామర్థ్యం పెరగడంతో పాటు చమురు ధరల తగ్గుదల కూడా దీనికి కారణమని చెబుతున్నారు.
ఎయిర్ ఇండియా ఆఫర్లు
దీపావళి సందర్భంగా ఎయిర్ ఇండియా ప్రయాణికులకు ప్రత్యేక తగ్గింపుపై విమాన టిక్కెట్లను విక్రయిస్తోంది. సింగపూర్ కు, అక్కడి నుంచి తిరిగి వచ్చే వన్ వే టిక్కెట్లను రూ.7,445 నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆఫర్ కింద అక్టోబర్ 8 నుంచి నవంబర్ 30వ తేదీ మధ్య ప్రయాణం చేయవచ్చు.
సింగపూర్ వెళ్లే, తిరిగి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు సైతం ప్రత్యేక డీల్ అందుబాటులో ఉన్నాయి. వారు 500 డాలర్ల కన్నా (రూ.32,231) తక్కువకు టిక్కెట్లను పొందవచ్చు. వీరు 2025 మార్చి వరకూ ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.
సౌదీ అరేబియాలోని రియాద్, జెద్దాలకు వెళ్లాలనుకున్న వారికి సైతం టిక్కెట్లపై ఆఫర్ అందుబాటులో ఉంది. నవంబర్ 17వ తేదీలోపు టిక్కెట్ బుక్ చేసుకున్న వారికి కేవలం రూ.32,611 మాత్రమే పడుతుంది. వీరు 2025 మార్చి వరకూ ప్రయాణం చేయవచ్చు.
ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల నుంచి ప్రయాణం చేసేవారు బిజినెస్ క్లాస్ లో 10 శాతం, ఎకానమీ క్లాస్ లో 5 శాతం తగ్గింపు పొందవచ్చు.
వన్ వే డొమెస్టిక్ విమానాల్లో నవంబర్ 30 వరకూ ప్రయాణం చేసే వారికి తక్షణ తగ్గింపుగా రూ.200 అందిస్తున్నారు.
విస్తారా ఆఫర్లు
విస్తారా ఎయిర్ లైన్స్ లో పండగ ఆఫర్లు ఏమీలేవు. ఎయిర్ ఇండియా లో విలీనం కారణంగా నవంబర్ నుంచి విస్తారా కార్యకలాపాలు ఆగిపోతాయి. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన రూట్లలో టిక్కెట్ల విక్రయాలు విస్తారా నుంచి ఎయిర్ ఇండియాకు మారతాయి.
ఇండిగో
దీపావళి సందర్భంగా విమాన టిక్కెట్లపై ఇండిగో ఎలాంటి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించలేదు. ఇండిగో వెబ్ సైట్, మొబైల్ అప్లికేషన్ నుంచి డైరెక్ట్ బుకింగ్ లపై ప్రయాణికులు పది శాతం వరకూ తగ్గింపును పొందుతున్నారు.
ఖతార్ ఎయిర్ వేస్ వంటి అంతర్జాతీయ విమానయాన సంస్థలు దీపావళికి టిక్కెట్ల ఆఫర్లు ప్రకటించాయి. బిజినెస్ క్లాస్ పై 25 శాతం, ఎకానమీ క్లాస్ పై 20 శాతం తగ్గింపును ఆఫర్ చేశాయి.