CCPA Fine to Amazon: బిజీ లైఫ్ లో ఆన్ లైన్ షాపింగ్ కు అంతా అలవాటుపడటంతో చాలా ఈకామర్స్ సంస్థలు నాణ్యత లేని వస్తువులను తమ వెబ్ సైట్ లలో విక్రయించడం ఇటీవల కాలంలో కామన్ అయిపోయింది. చూసే వస్తువు ఒకటైతే, మనకు వచ్చేది మరో రకంగా ఉండటంతో వినియోగదారులు చాలామంది వస్తువులను వాపస్ చేస్తుంటారు. అయితే తాను అమెజాన్ వెబ్ సైట్ లో కొనుగోలు చేసిన ప్రెషర్ కుక్కర్ నాణ్యత లేదని ఓ కొనుగోలు దారుడు కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ-సీసీపీఏ ను ఆశ్రయించడంతోఈ-కామర్స్ సంస్థ అమెజాన్ కు సీసీపీఏ లక్ష రూపాయల జరిమానా విధించడమే కాదు. సదరు సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు ఈతరహా నాణ్యత లేని ప్రెషర్ కుక్కర్లను 2,265 మందికి విక్రయించినట్లు గుర్తించిన కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ..ఆ మొత్తం కుక్కర్లను వెనక్కి తీసుకుని కొనుగోలు దారులకు డబ్బులు తిరిగిచ్చేయాలని స్పష్టంచేసింది.
అమెజాన్ లో ఆర్డర్ చేసిన ఓ ప్రెషర్ కుక్కర్ నాణ్యతకు సంబధించి ఓ కొనుగోలు దారుడు సీసీపీఏను ఆశ్రయించడంతో స్పందించిన ఫోరం ప్రెషర్ కుక్కర్ కు సంబంధించిన వివరాలు ఇవ్వాలని అమెజాన్ ను కోరింది. ఈ-కామర్స్ సంస్థ అందించిన వివరాలు పరిశీలించి..ఆ కుక్కర్లు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ నిబంధనలకు లోబడి లేదని వినియోగదారుల రక్షణ అథారిటీ తేల్చిచెప్పింది. వినియోగదారుల హక్కులను పరిరక్షించే సీసీపీఏ ఆదేశాలను అమెజాన్ ఉల్లంఘించిందని స్పష్టంచేసింది. అమెజాన్ సంస్థ తన వెబ్ సైట్ ద్వారా విక్రయించిన ప్రెషర్ కుక్కర్ లకు సేల్స్ కమీషన్ పొందింనట్లు ధృవీకరణఅయింది. దీంతో ఏ సంస్థ ఈకామర్స్ ప్లాట్ ఫారమ్ నుంచి ఆవస్తువులు విక్రయించారో నాణ్యతకు సంబంధించి ఆసంస్థ బాధ్యతవహించాల్సి ఉంటుందని కేంద్ర వినియోగదారుల రక్షణ అథారటీ తెలిపింది.
నాణ్యత లేని వస్తువులు విక్రయించినందుకు అమెజాన్ సంస్థకు లక్ష రూపాయల జరిమానా విధించడంతో పాటు.. నాణ్యత లేని ప్రెషర్ కుక్కర్లు కొనుగోలు చేసిన వారందరికీ సమాచారమిచ్చి.. వస్తువులు వెనక్కి తీసుకుని డబ్బులు వాపస్ చేయాలని ఆదేశించింది. ఈనాణ్యత లేని ఒక్కో ప్రెషర్ కుక్కర్ పై సుమారు 271 రూపాయల చొప్పున మొత్తం రూ.6,14,825.41ల కమీషన్ ను అమెజాన్ సంస్థ పొందింది. ఇప్పటివరకు విక్రయించిన నాణ్యత లేని ప్రెషర్ కుక్కర్లను రీకాల్ చేసి కొనుగోలు దారులకు మొత్తం రుసుమును రీయింబర్స్ చేయడంతో పాటు 45 రోజుల్లోగా పూర్తి నివేదికను సమర్పించాలని సీసీపీఏ అమెజాన్ ను కోరింది. దీంతో నేరుగా దుకాణాల్లోనే కాకుండా ఆన్ లైన్ లో కొనుగోలు చేసిన వస్తువుల విషయంలోనూ వినియోగదారులకు రక్షణగా నిలుస్తామని కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ స్పష్టంచేసినట్లైంది.