
సిటీలు, పట్టణాల్లో ఎక్కువమంది అద్దె ఇళ్లల్లో నివసిస్తూ ఉంటారు. అయితే అద్దె పెంపు, ఇంటిని ఖాళీ చేసే సమయంలో తరచూ యజమాని, అద్దెదారుడు మధ్య వివాదాలు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఇవి పోలీస్ స్టేషన్, కోర్టు కేసుల వరకు వెళ్లే అవకాశముంటుంది. కొంతమంది యజమానులు ముందస్తు సమాచారం లేకుండా అద్దెను సడెన్‌గా పెంచుతూ ఉంటారు. ఇక వివిధ కారణాలతో ఇంటిని వెంటనే ఖాళీ చేయమని కోరుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో అద్దె పెంచడానికి లేదా ఇంటిని ఖాళీ చేయించడానికి ఇంటి యజమానికి చట్టపరమైన హక్కులు ఉంటాయని అద్దెదారులు భావించి సైలెంట్‌గా ఉంటూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఇంటిని ఖాళీ చేస్తూంటారు. కానీ చట్టాల ప్రకారం సడెన్‌గా అద్దె పెంచడం, ఇల్లు ఖాళీ చేయాలని కోరే హక్కు యజమానికి ఉండదు.
రెంటల్ అగ్రిమెంట్, రాష్ట్ర చట్టాలు, నోటీసు పీరియడ్, అద్దెదారుడు, యజమాని మధ్య ముందుగా జరిగిన ఒప్పందం, షరతులపై రూల్స్ ఆధారపడి ఉంటాయి. దేశంలో అమల్లో ఉన్న అద్దె నియంత్రణ చట్టం కింద ఇంటి యజమాని ఉన్నట్లుండి అద్దె పెంచడం లేదా ఇంటిని ఖాళీ చేయించడం కుదరదు.ఇంటి యజమాని తన ఇష్టానుసారం అద్దెను పెంచడం కుదరదు. ఇరు పక్షాల మధ్య పరస్పర అంగీకారం, స్థానిక చట్టాలకు అనుగుణంగా మాత్రమే అద్దెను పెంచాల్సి ఉంటుంది. ఇక ఉన్నపళంగా ఇంటిని ఖాళీ చేయించే అధికారం కూడా అద్దెదారులు కలిగి ఉండరు. ముందుగా చేసుకున్న రెంటల్ అగ్రిమెంట్, వర్తించే అద్దె చట్టాలు, నోటీస్ పీరియడ్ వంటి నిబంధనలు వర్తిస్తాయి. తన సొంత ఇష్టంతో యజమాని వెంటనే ఖాళీ చేయించలేరు. రాష్ట్ర చట్టం, అద్దె ఒప్పందంలోని నిబంధనలను అనుసరించిముందుగా నోటీసు ఇవ్వాలి. ఆ తర్వాత మాత్రమే ఇల్లు ఖాళీ చేయించాల్సి ఉంటుంది.
అద్దె ఇంట్లోకి వెళ్లేటప్పుడు యజమాని, అద్దెదారుడి మధ్య రెంటల్ అగ్రిమెంట్ అనేది అత్యంత కీలకం. ఇందులోనే అద్దె చెల్లింపు, సెక్యూరిటీ డిపాజిట్, అద్దె పెంపు, ఇతర నిబంధనలు అన్నీ ఉంటాయి. ఇక అద్దె చెల్లింపు రికార్డులు, యజమానితో జరిగిన సంభాషణల ఆధారాలను భద్రపరచుకుంటే మంచిది. ఏదైనా వివాదం తలెత్తినప్పుడు ఈ ఆధారాలు ఉపయోగపడతాయి. సకాలంలో అద్దె చెల్లించకపోయినా, అద్దె ఒప్పందం ప్రకారం షరతులను ఉల్లంఘించినా, ఆస్తిని దుర్వినియోగం చేసినా లేదా చట్టవిరుద్ధంగా ఉపయోగించినా, వేరే నియమాలు ఉల్లంఘించినా ఖాళీ చేయించే హక్కు ఉంటుంది. అటువంటి సమయంలో చట్టపరంగా నోటీసులు ఇవ్వాలి. ఇక అద్దె పెంపు విషయంలో ఏకీభవించనంత మాత్రాన యజమాని అద్దెదారుని వెంటనే ఖాళీ చేయమని బలవంతం చేయలేరని నిపుణులు చెబతున్నారు.