
సొంత ఇల్లు కట్టుకోవడం ప్రతి ఒక్కరి కల. అందుకే ఇటుకలు, సిమెంట్, ఇసుక, ప్రధాన పిల్లర్లకు వాడే ఇనుప కడ్డీల విషయంలో ప్రజలు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కానీ ఇంట్లో నిత్యం ఉపయోగించే మెట్ల నిర్మాణం విషయంలో మాత్రం చాలామంది అంతగా శ్రద్ధ పెట్టరు. రోజువారీ రాకపోకలు, బరువైన వస్తువులను మోసుకెళ్లడం వల్ల మెట్లపై నిరంతరం ఒత్తిడి పడుతుంది. అందుకే మెట్లు దృఢంగా, దీర్ఘకాలం మన్నికగా ఉండాలంటే సరైన రకమైన స్టీల్ బార్లను ఎంచుకోవడం చాలా ముఖ్యం. చాలాసార్లు ఇంటి యజమానులకు ఉక్కు నాణ్యతపై అవగాహన లేకపోవడంతో మేస్త్రీలు తమకు అందుబాటులో ఉన్న కడ్డీలను వాడేస్తుంటారు. తీరా నిర్మాణం పూర్తయ్యాక మందపాటి కడ్డీలు వాడాల్సిన చోట సన్ననివి వాడారని, లేదా అవసరమైన దానికంటే తక్కువ ఇనుము ఉపయోగించారని తెలుసుకుని బాధపడుతుంటారు. మరి మెట్ల నిర్మాణంలో ఎలాంటి స్టీల్ వాడాలి? కొనుగోలు చేసేటప్పుడు ఏ విషయాలు గమనించాలో తెలుసుకోవడం ముఖ్యం.
సాధారణంగా ఇళ్లలో ఆర్సీసీ మెట్లను నిర్మించడానికి TMT స్టీల్ బార్లను ఉపయోగిస్తారు. వీటిని కాంక్రీట్‌తో కలిపినప్పుడు మెట్లకు అద్భుతమైన బలం చేకూరుతుంది. మార్కెట్లో TMT బార్లు Fe 500, Fe 500D వంటి వివిధ గ్రేడ్లలో లభిస్తాయి. వీటిలో Fe 500D అత్యుత్తమ ఎంపికగా నిపుణులు సూచిస్తున్నారు.
Fe 500D బార్లు అత్యంత బలంగా ఉండటంతో పాటు కొంతవరకు వశ్యతను కలిగి ఉంటాయి. దీనివల్ల మెట్లపై అధిక బరువు పడినప్పుడు లేదా భూకంపాలు, కంపనాలు వచ్చినప్పుడు అవి అకస్మాత్తుగా విరిగిపోకుండా ఒత్తిడిని తట్టుకుంటాయి.
మెట్ల నిర్మాణానికి 8 మి.మీ (8mm) లేదా 10 మి.మీ (10mm) స్టీల్ బార్లు సరిపోతాయని చాలామంది అనుకుంటారు. కానీ ఇది అన్ని సందర్భాల్లో సరైనది కాదు. ఇంటి మెట్ల నిర్మాణంలో 8mm, 10mm లేదా 12mm బార్లను ఉపయోగిస్తారు. అయితే ఏ సైజు కడ్డీలు వాడాలి, ఎన్ని కడ్డీలు వేయాలి, వాటి మధ్య దూరం ఎంత ఉండాలనేది మెట్ల పొడవు, వెడల్పు, డిజైన్ మరియు బరువు మోసే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి కేవలం మేస్త్రీ లేదా కాంట్రాక్టర్ మాటలపై ఆధారపడకుండా స్ట్రక్చరల్ ఇంజనీర్ ఇచ్చిన డిజైన్ ప్రకారమే స్టీల్ సైజును నిర్ణయించుకోవాలి.
మెట్ల పని ప్రారంభించే ముందే ఏ గ్రేడ్ స్టీల్ వాడుతున్నారు, కడ్డీల మధ్య దూరం సరిగ్గా ఉందా లేదా అని మేస్త్రీని అడిగి తెలుసుకోవాలి. కాంక్రీట్ వేయడానికి ముందు స్టీల్ కడ్డీలు అమర్చిన విధానాన్ని ఒక ఫోటో తీసి పెట్టుకోవడం మంచిది. మెట్ల బలం కేవలం ఖరీదైన స్టీల్ మీద మాత్రమే కాకుండా, సరైన డిజైన్, నాణ్యమైన సిమెంట్, కాంక్రీట్ మిశ్రమం పై కూడా ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి.