Ola Electric: అయ్య బాబోయ్.. ఓలా సర్వీస్ సెంటర్ల దగ్గర బౌన్సర్లు..! ఇది నిజమేనా..?

|

Oct 21, 2024 | 4:51 PM

Ola Service Center: ఓలా సర్వీస్‌పై తీవ్ర విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. అటు సోషల్ మీడియా వేదికగానూ కస్టమర్లు తమ అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓలా సర్వీస్ సెంటర్ల దగ్గర బౌన్సర్లను నియమించుకున్నారన్న వార్త కలకలం రేపుతోంది. అయితే ఇందులో నిజమెంత అన్నది తెలియడం లేదు. ఓలా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Ola Electric: అయ్య బాబోయ్.. ఓలా సర్వీస్ సెంటర్ల దగ్గర బౌన్సర్లు..! ఇది నిజమేనా..?
Ola Service Centre
Follow us on

ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్ సర్వీస్‌పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. బ్యాటరీ పేలిపోవడం వంటి ఘటనలకు తోడు.. ఓలా స్కూటీలో మూడు నాలుగు సమస్యలతో సర్వీస్ సెంటర్‌లకు వెళితే అవి వెనక్కి వచ్చేందుకు నెలల తరబడి వేచిచూడాల్సిన దుస్థితి ఉందని కస్టమర్లు పెదవి విరుస్తున్నారు. ఈ విషయమై పలువురు కస్టమర్లు సోషల్ మీడియా వేదికగా ఓలాపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓలా, దాని ఫౌండర్ భవేష్ అగర్వాల్‌ను స్టాండప్ కామెడియన్ కునాల్ కమ్రా మరోసారి టార్గెట్ చేశారు. గతంలో ఓలా సర్వీస్‌పై కునాల్ కమ్రా చేసిన విమర్శల వివాదంతో.. ఆ సంస్థ షేర్లు భారీగా నష్టపోయాయి. ఓలా సర్వీస్ సెంటర్ల దగ్గర పరిస్థితి దారుణంగా ఉందంటూ మరోసారి కునాల్ సంచలన కామెంట్ చేశారు. ఆ మేరకు ఓ ట్వీట్ షేర్ చేశారు. కంపెనీ సర్వీస్ సెంటర్ల దగ్గర ఓలా బౌనర్లను నియమించుకుందంటూ సంచలన ఆరోపణలు చేశారు.

ఓలా సర్వీస్ సెంటర్ దగ్గర తాను బౌన్సర్లను చూసినట్లు ఆర్జే కశ్యప్ అనే వ్యక్తి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రతి సర్వీస్ సెంటర్ దగ్గర ఐదారుగురు బౌన్సర్లను ఓలా నియమించుకున్నట్లు ఆరోపించారు. తాను స్థానిక ఓలా సర్వీస్ సెంటర్‌ను సందర్శించగా.. అక్కడ బౌన్సర్లు కస్టమర్లతో వాగ్వివాదం చేయడం చూసినట్లు తెలిపారు. మహిళా కస్టమర్లతోనూ వారు వాగ్వివాదం చేస్తున్నట్లు వెల్లడించారు. ఓలా కస్టమర్లకు ఇలాంటి సేవలు అందిస్తోందంటూ ఎద్దేవా చేశారు. కస్టమర్లను కంట్రోల్ చేసేందుకు ఓలా బౌన్సర్లను పెట్టుకోవడం దారుణమంటూ పలువురు నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. అయితే ఇప్పటి వరకు దీనిపై ఓలా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఓలా సర్వీస్‌పై కునాల్ కమ్రా కామెంట్స్..

ఈ నేపథ్యంలో ఈ ఎక్స్ పోస్ట్‌పై స్పందించిన కామెడియన్ కునాల్ కమ్రా.. జర్నలిస్ట్ ఎవరైనా దీనిపై ఫ్యాక్ట్ చెక్ చేయాలని కోరారు. బౌన్లర్లు పెట్టుకోవడం నిజమే అయితే.. ఇదో అరుదైనది.. సేల్స్ కోసం సేల్స్ టీమ్ & సేల్స్ తర్వాత బౌన్సర్స్ అంటూ ఎద్దేవా చేశారు. ఓలా ఫౌండర్ భవేష్ అగర్వాల్‌ను టార్గెట్ చేస్తూ మరో ఎక్స్ పోస్ట్ చేశారు. స్టాఫ్ రక్షణ కోసం బౌన్సర్లు పెట్టుకోవాల్సిన భారత ప్రోడక్ట్‌ను మీరు ఉత్పత్తి చేస్తున్నారంటూ సెటైర్లు వేశారు.