
ప్రతి సంవత్సరం మాదిరిగానే.. ఈ సంవత్సరం కూడా ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లు భారీ సేల్స్‌తో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. అక్టోబర్ 8 నుండి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ ప్రారంభమయ్యాయి. అలాగే మింత్రా, మీషో వంటి ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ప్రత్యేక సేల్స్ ప్రారంభమయ్యాయి. గత సంవత్సరం అన్ని ప్లాట్‌ఫారమ్‌లు కలిపి 1.2 లక్షల కోట్ల వ్యాపారం చేయగా.. ఈ సంవత్సరం ఇది 1.5 లక్షల కోట్ల మార్కును చేరుకుంటుందని అంచనాలు ఉన్నాయి. ఈ భారీ వ్యాపారం వెనుక వినియోగదారులకు నిజమైన ప్రయోజనాలు ఉన్నాయా.. లేదా అనేది ఒక ముఖ్యమైన ప్రశ్న. సేల్స్ సమయంలో అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లను తెరిస్తే.. ఫోన్‌లపై 40 శాతం, హోమ్ అప్లయెన్సెస్, టీవీలపై 65 శాతం, టాయ్స్‌పై 80 శాతం వరకు ఆఫర్లు కనిపిస్తాయి. అయితే ఈ ఆఫర్లన్నీ నిజమైనవి కావు. వీటిలో కొన్ని జెన్యూన్ ఆఫర్లు ఉండగా.. చాలా వరకు నకిలీ ఆఫర్లు ఉంటాయి. ఈ నకిలీ ఆఫర్ల పట్ల వినియోగదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
కొన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు సేల్స్‌కు 3 నుంచి 4 రోజుల ముందు ప్రోడక్టుల రెగ్యులర్ ధరలను 30 శాతం నుండి 40 శాతం వరకు పెంచుతాయి. ఆ తర్వాత సేల్ సమయంలో ఆ పెంచిన ధరను కొట్టేసి.. 30 శాతం డిస్కౌంట్ అని ప్రకటించి అసలు రెగ్యులర్ ధరకే వస్తువులను విక్రయిస్తాయి. ఉదాహరణకు ఒక ప్రోడక్ట్ రెగ్యులర్ ధర రూ.10 వేలుగా ఉంటే.. సేల్స్‌కు ముందు దాన్ని రూ.13 వేలకు పెంచుతారు. సేల్ స్టార్ట్ అయిన తర్వాత రూ. 10 వేలకు అమ్ముతారు. వినియోగదారులు 23 శాతం తగ్గిందని భావించి కొనుగోలు చేస్తారు. కానీ వాస్తవానికి రెగ్యులర్ ధరకే కొంటున్నారని వినియోగదారులు గమనించరు. ఒకవేళ కార్డ్ ఆఫర్లు ఉంటే.. అప్పుడు కొంత బెనిఫిట్ పొందవచ్చు. ఈ సేల్స్ టైమ్‌లో చాలా మంది చేసే మరో తప్పు “ఇంపల్స్ బయింగ్”. అంటే అవసరం లేని వస్తువులను కేవలం ఆఫర్లను చూసి కొనుగోలు చేయడం. ఒక వ్యక్తికి ఇప్పటికే ఐఫోన్ ఉన్నప్పటికీ.. సేల్స్‌లో రూ.80 వేల ఐఫోన్ రూ.65,000కి లభిస్తుందని చెప్పి కొనుగోలు చేస్తుంటారు.
ఆఫర్ చూసేంతవరకు కొత్త ఫోన్ అవసరం అనిపించదు. కానీ ఆఫర్ చూసిన తర్వాత అవసరం ఏర్పడినట్లు భావిస్తారు. ఇప్పుడు మీకు అవసరం లేనిది కొన్నట్లయితే.. భవిష్యత్తులో మీకు నిజంగా అవసరమైన వాటిని అమ్ముకోవాల్సి రావచ్చు. ఈ సేల్స్‌లో మీకు ఏది అవసరమో.. దాన్ని మాత్రమే కొనండి. మీకు అవసరం లేని వస్తువుపై 90 శాతం తగ్గింపు ఉన్నా కూడా కొనుగోలు చేయవద్దు. కొత్తగా ఇల్లు కొనుక్కున్న వారికి టీవీ అవసరం ఉండవచ్చు. అలాంటి వారు సేల్స్ కోసం ఎదురుచూసి, మంచి ఆఫర్లు, కార్డ్ ఆఫర్‌లతో టీవీని కొనుగోలు చేయవచ్చు. ఇది వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కొనేముందు ప్రోడక్ట్ హిస్టరీని పరిశీలించండి. ఆన్‌లైన్ సేల్స్‌లో జాగ్రత్తగా, అవగాహనతో షాపింగ్ చేసి అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి.