
Kicha Sudeep as guest: బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ నాలుగో సీజన్ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ షో ప్రారంభమై ఇవాళ్టికి 12 వారాలు పూర్తి అవ్వనుంది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ అభిమానులను మరింత ఎంటర్టైన్ చేసేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు ఈ షోలోకి అతిథులుగా రాగా.. ఇవాళ కన్నడ స్టార్ హీరో సుదీప్ షోలో రచ్చ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు.
బిగ్‌బాస్‌ని హోస్ట్ చేయడం నాకు ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. అయితే ఇవాళ తెలుగు బిగ్‌బాస్‌కి అతిథిగా వెళ్తుండటం మరింత సంతోషాన్ని ఇస్తోంది. ఎప్పుడూ అందంగా ఉండే నాగార్జున సర్‌తో స్టేజ్‌ని పంచుకోవడం, ఇంట్లో ఉన్న వారితో మాట్లాడటం ఆనందాన్ని ఇచ్చింది. మీ సాదర స్వాగతానికి థ్యాంక్యు సర్ అని సుదీప్ కామెంట్ పెట్టారు. ఈ సందర్భంగా నాగార్జునతో తీసుకున్న ఫొటోను కూడా షేర్ చేశారు. ఇక సుదీప్ మాటలను బట్టి చూస్తుంటే ఇవాళ ఎపిసోడ్ రచ్చ రచ్చగా ఉండబోతున్నట్లు అర్థమవుతోంది.
కాగా ఈగతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన సుదీప్.. ఆ తరువాత బాహుబలి 2, సైరా చిత్రాల్లో ఇక్కడి వారికి మరింత దగ్గరయ్యారు. ఇక మరోవైపు కన్నడలో బిగ్‌బాస్ షో 7 సీజన్లను పూర్తి చేసుకోగా.. అన్నింటికి సుదీప్‌నే వ్యాఖ్యతగా వ్యవహరించారు. ప్రస్తుతం అక్కడ ఎనిమిదో సీజన్ కొనసాగుతోంది.