
కట్టుకున్న భార్య చేతిలో భర్తలు దారుణంగా హత్యకు గురవుతున్న ఘటనలు ఈ మధ్యకాలంలో తరచూ వినాల్సి వస్తోంది. కొందరు ప్రియుడి మోజులో పడి పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటూ భర్తలను కడతేరుస్తుంటే.. మరికొందరు భర్తల తాగుడు తిప్పలు, నిత్య వేధింపులను తట్టుకోలేక క్షణికావేశంలో ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఇలాంటి ఘోరమే ఒకటి వెలుగుచూసింది. తాగి వచ్చి డబ్బుల కోసం వేధిస్తున్నాడనే కోపంతో.. కట్టుకున్న భర్తను కత్తిపీటతో నరికి చంపేసింది ఓ భార్య. ఈ ఘాతుకంతో ప్రకాష్ నగర్ ఏరియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శ్రీకాకుళం నగరంలోని ప్రకాష్ నగర్, గాజుల వీధికి చెందిన ధర్మాన అసిరినాయుడు క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య జయలక్ష్మి, మణికంఠ అనే కుమారుడు ఉన్నారు. అసిరినాయుడుకి తీవ్రమైన తాగుడు అలవాటు ఉంది. ప్రతిరోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడటం అతనికి నిత్యకృత్యంగా మారింది.
ఈ క్రమంలోనే గురువారం రాత్రి కూడా అసిరినాయుడు బాగా తాగి ఇంటికి వచ్చాడు. అదనంగా డబ్బులు కావాలంటూ భార్య జయలక్ష్మితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. భర్త నిత్య వేధింపులతో తీవ్ర విసుగు చెంది, తీవ్ర ఆగ్రహానికి లోనైన జయలక్ష్మి.. క్షణికావేశంలో ఇంట్లో ఉన్న కత్తిపీటను తీసుకుని భర్తపై విచక్షణారహితంగా దాడి చేసింది. తీవ్ర గాయాలవ్వడంతో అసిరినాయుడు అక్కడికక్కడే రక్తపు మడుగులో విగతజీవిగా పడిపోయాడు. అసిరినాయుడు కుమారుడు మణికంఠ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో విధులను ముగించుకుని ఇంటికి వచ్చేసరికి తండ్రి విగతజీవిగా పడి ఉండటం చూసి షాకయ్యాడు. అసలేం జరిగిందని తల్లి జయలక్ష్మిని ప్రశ్నించగా.. తామిద్దరం గొడవ పడ్డామని, ఆ క్రమంలోనే అతను కిందపడిపోయాడంటూ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ తండ్రి మృతిపై అనుమానం వచ్చిన కుమారుడు మణికంఠ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
ఈ సమాచారం అందుకున్న వెంటనే శ్రీకాకుళం పోలీసులు రంగంలోకి దిగారు. క్లూస్ టీమ్ కూడా స్పాట్‌కు చేరుకుని ఘటనా స్థలం నుండి కీలక ఆధారాలను సేకరించింది. కుమారుడు మణికంఠ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం ఉదయం అసిరినాయుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. భర్త హత్యకు పాల్పడిన భార్య జయలక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. క్షణికావేశంలో తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం.. ఒకరి ప్రాణం తీయడమే కాకుండా, కన్న కొడుకును అనాథను చేసి, ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.