Andhra: అంత్యక్రియలకు కూడా ఎంత కష్టమొచ్చిందో చూశారా..?

ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెదకాద గ్రామంలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఏడొంపుల గెడ్డ పొంగిపొర్లడంతో గ్రామ స్మశానానికి మృతదేహాలను తరలించడం కష్టంగా మారింది. దీంతో గ్రామస్థులు ప్రాణాలకు తెగించి వరద నీటిలో మృతదేహాలను భుజాలపై మోసుకుంటూ స్మశానానికి తరలించారు. గెడ్డపై వంతెన నిర్మించి, సురక్షిత రహదారి ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Andhra: అంత్యక్రియలకు కూడా ఎంత కష్టమొచ్చిందో చూశారా..?
Flood Water Funeral

Edited By:

Updated on: Sep 24, 2026 | 9:55 PM

విజయనగరం జిల్లాలోని దత్తిరాజేరు మండలం పెదకాద గ్రామంలో అమానుష పరిస్థితి నెలకొంది. ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన సామిరెడ్డి పరదేశమ్మ (65), మంగిరెడ్డి లక్ష్మంనాయుడు అనారోగ్యంతో మృతి చెందడంతో వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చింది.

గ్రామానికి సమీపంలో ప్రవహించే ఏడొంపుల గెడ్డ ప్రస్తుతం భారీగా పొంగిపొర్లుతోంది. గెడ్డకు అవతలి వైపునే గ్రామ స్మశానం ఉండటంతో మృతదేహాలను అక్కడికి తరలించడం కుటుంబ సభ్యులకు సవాల్‌గా మారింది. సాధారణ రోజుల్లో సులభంగా వెళ్లగలిగే మార్గం.. భారీ వర్షాలు, వరద నీటితో ప్రమాదకరంగా మారింది.

అయినా అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉండటంతో గ్రామస్థులు ప్రాణాలకు తెగించి మృతదేహాలను భుజాలపై మోశారు. లోతైన వరద నీటిలోకి దిగి, ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డను దాటి మృతదేహాలను స్మశానానికి తరలించారు. ఒకవైపు ఆత్మీయులను కోల్పోయిన బాధ.. మరోవైపు అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ప్రాణాలను పణంగా పెట్టాల్సిన పరిస్థితి కుటుంబ సభ్యులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది.

వరదొస్తే ప్రతిసారీ ఇదే పరిస్థితి

ఏడొంపుల గెడ్డకు వరద ఉధృతి పెరిగిన ప్రతిసారీ స్మశానానికి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అత్యవసర సమయంలో మృతదేహాలను తరలించేందుకు కూడా సురక్షితమైన మార్గం లేకపోవడంతో తమ పరిస్థితి దయనీయంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వరదల సమయంలో కనీసం మృతదేహాలను సురక్షితంగా స్మశానానికి తరలించేలా శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఏడొంపుల గెడ్డపై వంతెన నిర్మించడంతో పాటు, అన్ని కాలాల్లో రాకపోకలకు అనువైన సురక్షిత మార్గాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

జీవించి ఉన్నప్పుడు రాకపోకలకు ఇబ్బందులు.. మరణించిన తర్వాత అంత్యక్రియలకు కూడా అవస్థలు పడాల్సిన పరిస్థితి పెదకాద గ్రామంలో నెలకొనడం స్థానికుల దుస్థితికి అద్దం పడుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామస్థుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us