Andhra Pradesh: దోస్తుల కళ్లముందే పోయిన రెండు ప్రాణాలు.. గుండెల్ని పిండేసే విషాదం..

హాలిడే వచ్చిందంటే చాలు.. కాలేజీ విద్యార్థులు సరదాగా గడపడానికి బీచ్‌లు, రిజర్వాయర్ల బాట పడుతుంటారు. కానీ ఆ కాసేపటి సరదా.. క్షణాల్లో ఎంతటి ఘోర విషాదాన్ని నింపుతుందో చెప్పడానికి విశాఖలో జరిగిన ఈ ఘటనే ఒక నిదర్శనం. ప్రాణ స్నేహితులంతా కలిసి హ్యాపీగా షికారుకెళ్లారు.. నీటిని చూడగానే స్నానానికి దిగారు.. కానీ కాసేపట్లోనే ఊహించని విషాదం చోటుచేసుకుంది.

Andhra Pradesh: దోస్తుల కళ్లముందే పోయిన రెండు ప్రాణాలు.. గుండెల్ని పిండేసే విషాదం..
Inter Students Drown In Meghadri Gedda Reservoir

Edited By:

Updated on: Jul 19, 2026 | 9:35 PM

ఆదివారం సెలవు రోజు.. పైగా ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రాణ స్నేహితులు.. అంతా కలిసి సరదాగా కాసేపు షికారుకెళ్లి ఎంజాయ్ చేద్దామనుకున్నారు. అనుకున్నదే తడవుగా అందరూ కలిసి రిజర్వాయర్ బాట పట్టారు. నీటిని చూడగానే ఉత్సాహంతో స్నానానికి దిగారు. కానీ, ఆ నీటి లోతుల్లో తమ పాలిట మృత్యువు పొంచి ఉందని ఆ అమాయక విద్యార్థులు ఊహించలేకపోయారు. కళ్లముందే ఇద్దరు స్నేహితులు నీటి ఊబిలో మునిగిపోతుంటే కాపాడలేక, మిగిలినవారు గుండెలవిసేలా రోదించిన సంఘటన విశాఖపట్నంలో తీవ్ర విషాదాన్ని నింపింది. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతగట్ల సమీపంలోని మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్‌లో ఆదివారం ఈ విషాదఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

అసలేం జరిగిందంటే..?

నగరానికి చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు మంచి స్నేహితులు. ఆదివారం కావడంతో వారంతా కలిసి సరదాగా విహారయాత్ర కోసం మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే నీటిలోకి దిగి స్నానాలు చేయడం ప్రారంభించారు. అయితే రిజర్వాయర్‌లోని నీటి లోతు, అక్కడ ఉన్న ప్రమాదకరమైన ఊబి గురించి తెలియకపోవడంతో… స్నానానికి దిగిన ఐదుగురిలో దీపక్ (17), రామచంద్రరావు(18) అనే ఇద్దరు విద్యార్థులు అకస్మాత్తుగా నీటిలో మునిగిపోతూ గల్లంతయ్యారు. ఒడ్డున ఉన్న వారి సహచరులు వారిని రక్షించేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

రంగంలోకి గజ ఈతగాళ్లు – మృతదేహాలు లభ్యం

కళ్లముందే స్నేహితులు ఊబిలో మునిగిపోవడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన మిగిలిన విద్యార్థులు వెంటనే స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పెందుర్తి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి, గల్లంతైన విద్యార్థుల కోసం గజఈతగాళ్లను రంగంలోకి దించి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. గజఈతగాళ్లు రిజర్వాయర్‌లోని ఊబిలో కూరుకుపోయిన దీపక్, రామచంద్రరావుల మృతదేహాలను వెలికితీశారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. బాధిత విద్యార్థుల వివరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుల్లో దీపక్ (17) సింహాచలం గోసాలకు చెందినవాడిగా, రామచంద్రరావు (18) ఎన్ఏడి ఆర్ అండ్ బి శివనగర్ నివాసిగా పోలీసులు గుర్తించారు. చేతికొచ్చిన కొడుకులు కళ్లముందే శవాలుగా మారడంతో ఆయా కుటుంబాల్లో తీరని శోకం అలుముకుంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు స్థానికులను సైతం కదిలించివేసింది.

Follow Us