
విశాఖపట్నం ఆర్‌కే బీచ్‌లో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సాగర స్వచ్ఛత కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన సీఎం.. సముద్రాన్ని ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి విముక్తి చేసేందుకు చేపడుతున్న చర్యలను అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, మత్స్యకారులు, స్కూబా డైవర్లను అడిగి తెలుసుకున్నారు.

పెదజాలరిపేటలో ఏర్పాటు చేసిన ఓషన్ ప్లాస్టిక్ రికవరీ సెంటర్ పైలట్ సైట్‌ను సీఎం చంద్రబాబు నాయడు వర్చువల్‌గా ప్రారంభించారు. సముద్రంలో సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను డిజిటల్ తూకం వేసే విధానాన్ని పరిశీలించారు. ప్లాస్టిక్ సేకరణలో పాల్గొంటున్న మత్స్యకారులతో చంద్రబాబు ముఖాముఖి మాట్లాడారు. చేపల వేటతో పాటు సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడం ద్వారా తమకు ప్రోత్సాహకం లభిస్తోందని, దీంతో అదనపు ఆదాయం సమకూరుతోందని మత్స్యకారులు సీఎంకు వివరించారు. అనంతరం సముద్ర వ్యర్థాల సేకరణకు సంబంధించిన ప్రోత్సాహకాన్ని సీఎం స్వయంగా మత్స్యకారులకు అందించారు.

స్కూబా డైవర్లతోనూ సీఎం మాట్లాడారు. సముద్ర గర్భంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, పాత చేపల వలలను ఎలా గుర్తించి తొలగిస్తున్నారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. సాగర స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా 1,200 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. మ్యాన్‌హోళ్లు, మురుగు కాల్వల శుభ్రత కోసం జీవీఎంసీ అందుబాటులోకి తెచ్చిన ఆధునిక సీవరేజ్ రోబో పనితీరును కూడా చంద్రబాబు పరిశీలించారు. మానవులు ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆధునిక సాంకేతికతను ఉపయోగించడంపై అధికారులు వివరించారు.

జీవీఎంసీ చేపడుతున్న సాగర స్వచ్ఛత ప్రాజెక్టుకు లభించిన అంతర్జాతీయ గుర్తింపు, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై బ్లూమ్‌బెర్గ్ ప్రతినిధులతో సీఎం చర్చించారు. విశాఖ సాగర తీరాన్ని మరింత పరిశుభ్రంగా, పర్యావరణహితంగా మార్చేందుకు చేపడుతున్న చర్యలపై వివరాలు తెలుసుకున్నారు.

ఆర్‌కే బీచ్ పరిసరాల్లో మురిమిక్చర్ విక్రయిస్తున్న ఓ మహిళతోనూ చంద్రబాబు మాట్లాడారు. ఆమె జీవనోపాధి, కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆమె ఒంటరి మహిళ అని తెలుసుకున్న సీఎం.. ఆమెకు పెన్షన్ మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆమె విక్రయిస్తున్న మురిమిక్చర్‌ను చంద్రబాబు స్వయంగా రుచి చూశారు.

సాగర స్వచ్ఛతతో పాటు సముద్రంపై ఆధారపడి జీవించే మత్స్యకారులకు అదనపు ఆదాయం కల్పించడం, ఆధునిక సాంకేతికతను వినియోగించడం, తీర ప్రాంతాల్లో జీవనోపాధికి భరోసా కల్పించడం వంటి అంశాలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు.