వర్షాల కోసం వింత సాంప్రదాయం.. పెళ్లి కాని యువకులతో 108 బిందెలతో జలాభిషేకం!

వర్షాలు కురవాలని కోరుతూ అనంతపురం జిల్లా ఉరవకొండలోని జమ్మి అంకాలమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం ఏడుగురు పెళ్లి కాని యువకులు 108 బిందెలతో నీటిని మోసుకొచ్చి శమీ వృక్షం, నాగుల కట్టకు జలాభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి 108 కొబ్బరికాయలు కొట్టి, 108 నిమ్మకాయలతో మాలను సమర్పించారు. పూజల తర్వాత జొన్నలపై ఉంచిన చిన్న రాతి గుండుపై యువకుడు కూర్చొని గిరగిరా తిరిగే అరుదైన ఆచారాన్ని నిర్వహించారు..

వర్షాల కోసం వింత సాంప్రదాయం.. పెళ్లి కాని యువకులతో 108 బిందెలతో జలాభిషేకం!
Anantapur Rain Ritual

Edited By:

Updated on: Jul 10, 2026 | 8:30 PM

అనంతపురం, జులై 10: అనంతపురం జిల్లా ఉరవకొండలో వర్షం కోసం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. జమ్మి అంకాలమ్మ దేవస్థానంలోని శమీ వృక్షం, నాగుల కట్టకు 108 బిందెలతో ఏడుగురు పెళ్లి కాని యువకులు జలాభిషేకం చేశారు. అభిషేకం అనంతరం జొన్నలపై ఉంచిన చిన్న రాతి గుండుపై కూర్చుని గిరగిరా తిరిగే అరుదైన ఆచారం అవలంబించారు.

అనంత అన్నదాత ఆశగా ఆకాశం వైపు చూస్తున్నా ఆ వరుణుడు మాత్రం కన్నెత్తి కూడా చూడటం లేదు. విత్తనాలు వేసే సమయం ముగిసిపోతున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆ వరుణుడు కరుణించి వర్షం కురిపించాలని ఉరవకొండ పట్టణంలోని జమ్మి అంకాలమ్మ ఆలయం వద్ద తరతరాలుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం వర్షం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడుగురు పెళ్లి కాని యువకులు 108 బిందెలతో నీటిని మోసుకొచ్చి శమీ వృక్షం, నాగుల కట్టకు జలాభిషేకం చేశారు. అనంతరం కొత్త కుండను జొన్నలపై ఉంచి నీటితో నింపి, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు కురవాలని సంకల్పం చేసి అదే నీటితో దేవతలకు అభిషేకం చేశారు.

అనంతరం 108 కొబ్బరికాయలు కొట్టి, 108 నిమ్మకాయలతో మాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం జొన్నలను వృత్తాకారంలో పోసి వాటిపై చిన్న రాతి గుండును ఉంచుతారు. వర్షం రావాలని సంకల్పం చేసిన యువకుడు ఆ గుండుపై కూర్చోగా.. అతను గిరగిరా తిరగడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇలా గుండు తిరిగితే జమ్మి అంకాలమ్మ అనుగ్రహంతో తప్పకుండా వర్షాలు కురిసి రైతులకు మేలు జరుగుతుందని స్థానికుల విశ్వాసం. ఈసారి కూడా ఆ ఆచారం ప్రకారం గుండు తిరగడంతో త్వరలో మంచి వర్షాలు కురుస్తాయని స్థానికుల నమ్మకం. రైతుల కష్టాలు తొలగి పంటలు పండాలని ఉరవకొండ లో జరిగే ఈ వింత ఆచారం అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Follow Us