Andhra: పొలంలో ఇదేం పనిరా.. పొద్దున్నే చేనుకు వెళ్లి కంగుతిన్న రైతు

గుళ్లు, గోపురాలకే కాదు… ఇప్పుడు పంట పొలాలకూ గుప్తనిధుల వేటగాళ్ల కన్నుపడుతోంది. మార్కాపురం జిల్లా కంభం పట్టణ పరిధిలోని ఓ పొలంలో పురాతన నంది విగ్రహం కింద గుప్తనిధుల కోసం రాత్రికి రాత్రే తవ్వకాలు జరగడం కలకలం రేపింది. .. ..

Andhra: పొలంలో ఇదేం పనిరా.. పొద్దున్నే చేనుకు వెళ్లి కంగుతిన్న రైతు
Farmland Excavation

Edited By:

Updated on: Feb 01, 2026 | 7:45 PM

గుళ్లు, గోపురాల్లోనే కాదు పంట పొలాల్లో కూడా గుప్త నిధుల కోసం వేటగాళ్లు తవ్వకాలు జరపడం చర్చనీయాంశంగా మారింది.. ఓ పొలంలో పురాతన నంది విగ్రహం ఉంది. నంది విగ్రహం ఉన్న ప్రాంతం గతంలో సాధారణ భూమిగా ఉండేది… కాలక్రమంలో దాన్ని పొలంగా మార్చి పంటలు వేసుకుంటున్నారు… పురాతన నంది విగ్రహాన్ని తొలగించడం ఇష్టం లేక అలాగే ఉంచేశారు. అయితే ఈ నంది విగ్రహం కింద గుప్తనిధులు ఉంటాయన్న అనుమానంతో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రి నంది విగ్రహాన్ని పెకలించి గుంతను తవ్వి నిధుల కోసం వెతికారు. ఉదయం పొలానికి వెళ్లిన రైతు నంది విగ్రహం పెకలించి వేసి.. గుంత తవ్వి ఉండటాన్ని గమనించడంతో గుప్త నిధుల వేటగాళ్ల నిర్వాకం బయటపడింది.

మార్కాపురం జిల్లా కంభం పట్టణంలోని కంభం చెరువుకు వెళ్లే దారిలో ఓ పొలంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగినట్లు సమాచారం కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు పొలంలో ఉన్న పురాతన నంది విగ్రహం కలిగిన రాయిని తొలగించి, దాని కింద తవ్వకాలు చేపట్టినట్లు స్థానికులు గుర్తించారు. ఈ ఘటన కొంత ఆలస్యంగా వెలుగులోకి రావడంతో గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. పురాతన విగ్రహాన్ని కదిలించడం, అనుమానాస్పదంగా తవ్వకాలు జరగడం వెనుక గుప్తనిధుల ఆశే కారణమై ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కంభం పోలీసులను వివరణ కోరగా ఇప్పటివరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై శివకృష్ణారెడ్డి తెలిపారు. ఫిర్యాదు అందితే విచారణ చేపట్టి, దుండగులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.