
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల కొండపైకి రెండు రోజుల పాటు బైక్లను అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నవరాత్రి బ్రహ్మోత్సవాల క్రమంలో రెండ్రోజుల పాటు బైక్ల రాకపోకలపై నిషేధం అమల్లోకి తీసుకొచ్చినట్లు టీటీడీ ప్రకటన జారీ చేసింది. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అత్యంత ముఖ్యమైన గరుడ వాహన సేవ అక్టోబర్ 16వ తేదీన సాయంత్రం 6.30 గంటలకు అట్టాహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు తిరుమల కొండపైకి భారీగా చేరుకోనున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని భద్రత, రద్దీ దృష్ట్యా బైక్ల రాకపోకలను బ్యాన్ చేశారు. అక్టోబర్ 17 నఉదయం 6 గంటల వరకు ఈ నిషేధం వర్తింపచేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. తిరుమల కొండపై రెండూ ఘాట్ రోడ్లలోనూ ద్విచక్ర వాహనాలను అనుమతించూడదని నిర్ణయించింది.
ద్విచక్ర వాహనాలకు అనుమతి లేకపోవడంతో ఈ రెండు రోజలు పాటు ఏపీఎస్ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలతో పాటు పండుగ సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. రద్దీ ఎక్కువ కావడం వల్ల పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. దీంతో గరుడ సేవలకు హాజరయ్యే భక్తులు తమ వాహనాలకు బదులు ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు చేరుకోవాలని టీటీడీ సూచిస్తోంది. వాహనాలను తిరుపతిలోని పార్కింగ్ ఏరియాల్లో ఉంచుకోవాలని చెబుతున్నారు. అయితే తిరుమల కొండపైకి బైక్లను నిషేధించడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ బ్రహ్మోత్సవాలు, రద్దీ సమాయాల్లో టీటీడీ ఇదే పని చేసింది. ఇప్పుడు రద్దీ కారణంగా మళ్లీ అదే నిర్ణయం అమలు చేస్తోంది. భక్తులు తమకు సహకరించాలని, బైక్లపై రావాలనుకునేవారు ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.
చాలామంది బైక్లపై తిరుపతి నుంచి ఘాట్ రోడ్ ద్వారా తిరుమలకు చేరుకుంటుంటారు. భక్తుల రద్దీ సమయంలో కొండపై పార్కింగ్ సమస్య ఏర్పడుతుంది. దీనిని నియంత్రించేందుకు బైక్ల రాకపోకలపై టీటీడీ నిషేధం కొన్ని సమయాల్లో అమలు చేస్తోంది. కాగా గురువారం శ్రీవారు శ్రీ మలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి బకాసుర వధ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అపూర్వ ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తుల పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అటు దసరా పండుగల క్రమంలో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. స్వామివారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది. దీంతో దానికి తగినట్లు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.