Kuppam : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇలాకాలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మళ్లీ హల్ చల్ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్టీఆర్ జెండాని మళ్లీ రెపరెపలాడిస్తున్నారు. 40 అడుగుల ఎత్తులో తాజాగా జెండా ఏర్పాటు చేసిన అభిమానులు.. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలి పంచాయతీ ఎన్నికల ఫలితాలు సమయంలో కూడా కుప్పంలో ఎన్టీఆర్ అభిమానులు ఇలానే కాకరేపారు. పార్టీ అధినేత ఇలాకా కుప్పంలో పార్టీకి వ్యతిరేక పవనాలు వీయడంతో స్థానిక నాయకులతో పాటు కార్యకర్తలు నిరాశలో మునిగిపోయారు. కొందరైతే రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో “రావాలి జూనియర్… కావాలి ఎన్టీఆర్” అంటూ నినదించారు తెలుగు తమ్ముళ్లు.
ఈ డిమాండ్ రాష్టవ్యాప్తంగా ఎంతోకాలంగా ఉన్నప్పటికీ నాలుగడుగులు ముందుకేసి జూనియర్ ఎన్టీఆర్ను కుప్పం తీసుకురావాలని ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబుకే సరాసరి విజ్ఞప్తి చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అధినేత టూర్లో జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు చేసి తెలుగుదేశం పార్టీలోనే కొత్త చర్చకు తెరతీశారు. ఇప్పుడు మళ్లీ జై జై.. జూనియర్ ఎన్టీఆర్ అంటూ నినదిస్తున్నారు.