Tirumala: శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులే టార్గెట్.. నలుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

Tirumala: టీటీడీ వసతి గదులను అధికారిక కౌంటర్లు, అధికారిక ఆన్‌లైన్ విధానాల ద్వారానే పొందాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించరాదని కోరుతోంది. ఎవరైనా అధిక ధరలకు గదులు విక్రయిస్తున్నట్లు గమనిస్తే వెంటనే తిరుమల పోలీసులకు, టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించాలని..

Tirumala: శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులే టార్గెట్.. నలుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు
Tirumala

Edited By:

Updated on: Jul 04, 2026 | 8:03 AM

Tirumala: తిరుమల కొండ పై నకిలీగాళ్ళ ఆట కట్టిస్తున్నారు పోలీసులు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులను టార్గెట్ చేస్తున్న ముఠాల గుట్టు రట్టు చేస్తున్నారు. కొండపై భక్తులకు వసతి కల్పిస్తామంటూ బురిడీ కొట్టించే ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోతున్నారు. ఇందులో భాగంగానే నకిలీ ఆధార్ కార్డులతో టీటీడీ గదుల అక్రమ బుకింగ్ చేస్తున్న అంత ర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. టీటీడీ విజిలెన్స్ సమాచారంతో తిరుమల టూ టౌన్ పోలీసులు ఈ మేరకు కొరడా జులిపించారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి 12 నకిలీ ఆధార్ కార్డులు, 2 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దళారులను ఆశ్రయించవద్దని శ్రీవారి భక్తులకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

వివరాల్లోకెళ్తే తిరుమలలో సామాన్య భక్తులకు కేటాయించే టీటీడీ వసతి గదులను నకిలీ ఆధార్ కార్డులతో అక్రమంగా పొందుతున్న ముఠా గదులు దొరకని భక్తులకు అధిక ధరలకు విక్రయించి అక్రమ లాభాలు పొందుతున్నట్లు టిటిడి విజిలెన్స్ దృష్టికి వచ్చింది. ఈ మేరకు నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠా సమాచారాన్ని టీటీడీ విజిలెన్స్ సేకరించింది. ఈ నెల 2 న సి.ఆర్.ఓ. కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను టీటీడీ సిబ్బంది గుర్తించి పోలీసులకు అప్పగించింది.

ఈ మేరకు తిరుమల టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తులో మొబైల్ యాప్‌ల ద్వారా నకిలీ ఆధార్ కార్డులను తయారు చేసి టీటీడీ గదులను పొందడం, అనంతరం వాటిని రూ.2 వేలు నుంచి రూ.3 వేలు వరకు అధిక ధరలకు భక్తులకు విక్రయిస్తూ వచ్చినట్లు వెల్లడైంది. వారి సమాచారంతో మరో నిందితుడిని కూడా అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితుల్లో తెలంగాణకు చెందిన ఎం. వేణుగోపాల్, టి.ఈశ్వర్ తోపాటు ఏపీ కి చెందిన దొంత రవీంద్రబాబు, ఉత్తర ప్రదేశ్ కు చెందిన సంతోష్ కుమార్‌లు ఉన్నారు. నిందితుల నుంచి రెండు ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్లు,12 నకిలీ ఆధార్ కార్డులు, డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ముఠా గత కొంతకాలంగా నకిలీ ఆధార్ కార్డులతో టీటీడీ గదులను అక్రమంగా పొందుతూ శ్రీవారి భక్తులను, టీటీడీని మోసం చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. నిందితులను కోర్టు లో హాజరు పరిచిన పోలీసులు చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఈ అక్రమ దందాను ఛేదించిన తిరుమల టూ టౌన్ పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులను తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి మురళీకృష్ణ అభినందించారు.

టీటీడీ వసతి గదులను అధికారిక కౌంటర్లు, అధికారిక ఆన్‌లైన్ విధానాల ద్వారానే పొందాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించరాదని కోరుతోంది. ఎవరైనా అధిక ధరలకు గదులు విక్రయిస్తున్నట్లు గమనిస్తే వెంటనే తిరుమల పోలీసులకు, టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించాలని అభ్యర్థిస్తోంది. భక్తులను మోసం చేసే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని టిటిడి విజిలెన్స్, పోలీసు యంత్రాంగం హెచ్చరిస్తోంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us