తప్పిపోయిన ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత జరిగింది తెలిస్తే కన్నీళ్లాగవు

తిరుపతి జిల్లా, తొట్టంబేడు మండలం, కత్తి వారి కండ్రిగలో శివాజీ అనే యువకుడు విద్యుత్ షాక్‌తో మరణించాడు. తప్పిపోయిన ఆవును వెతుకుతూ మామిడి తోటలో అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.

తప్పిపోయిన ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత జరిగింది తెలిస్తే కన్నీళ్లాగవు
Representative Image

Updated on: Jun 10, 2026 | 8:07 AM

తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం కత్తి వారి కండ్రిగలో శివాజీ అనే యువకుడి మృతి విషాదాన్ని మిగిల్చింది. విద్యుత్ షాక్ కు గురై మృతి చెందిన యువకుడు శివాజీగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శివాజీ మృతికి గల కారణాలను అన్వేషించారు. ఈ కేసులో ముగ్గుర్ని బాధ్యులుగా గుర్తించి అరెస్టు చేసిన పోలీసులు వివరాలను వెల్లడించారు. రెండ్రోజుల క్రితం మేత కోసం అడవికి తీసుకెళ్లిన పశువుల్లో ఒక ఆవు కనిపించకుండా పోయింది. ఆవు తిరిగి ఇంటికి చేరకపోవడంతో శివాజీ ఆవును వెతికే ప్రయత్నం చేశాడు. బాలయ్య అనే సమీప బంధువుతో కలిసి ఆవులు వెతికెందుకు అడవికి వెళ్ళాడు.

ఆవును వెతుక్కుంటూ శివాజీ బాలయ్య ఇద్దరూ మామిడి తోటలోకి వెళ్లారు. మామిడి తోటను అడవి జంతువుల నుంచి కాపాడుకునేందుకు పొలం చుట్టూ విద్యుత్ వైర్లతో కంచె నిర్మాణం చేసుకున్నారు అదే గ్రామానికి చెందిన మేకల దొరబాబు కత్తి గురవయ్య, కత్తి సుధాకర్. మామిడి తోట చుట్టూ అక్రమంగా విద్యుత్ వైర్లను ఏర్పాటు చేసిన విషయం తెలియక శివాజీ మామిడి తోటలోకి వెళ్లే ప్రయత్నం చేశాడు. విద్యుత్తు తీగలు శివాజీకి తాకి అక్కడికక్కడే కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. ఇది గమనించిన బాలయ్య వెంటనే గ్రామంలోకి వెళ్లి జరిగిన విషయాన్ని బంధువులకు చెప్పాడు.

వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న శివాజీ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తప్పిపోయిన ఆవును వెతికేందుకు వెళ్లిన శివాజీ విద్యుత్ షాక్ కు గురై మృత్యువాత పడినట్లు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితులు దొరబాబు, కత్తి గురవయ్య, కత్తి సుధాకర్ లను అరెస్ట్ చేసిన పోలీసులు బిఎన్ఎస్ యాక్ట్ తో పాటు విద్యుత్తు చట్టాల కింద కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. పాడి ఆవును వెతి కేందుకు వెళ్లి శివాజీ ప్రాణాలు పోగొట్టుకోవడంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us