Andhar News: రూపాయికి 3 రూపాయలు.. మార్కెట్‌లోకి నయాదందా! నమ్మారంటే ఇక అంతే!

తిరుపతి జిల్లాలో కొత్తరకం దందా వెలుగు చూసింది. రూపాయికి రూ. 3 ఇస్తామంటూ బురిడీ కొట్టిస్తున్న ఓ ముఠా మోసాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఒకటికి రెండింతల డబ్బులు ఇస్తామని.. ఓ రియల్‌ ఎస్టేట్ వ్యాపారి నుంచి ఏకంగా రూ.14లక్షలు కాజేసిన ఈ ముఠా కోసం ప్రస్తుతం పోలీసులు గాలింపు చేపట్టారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Andhar News: రూపాయికి 3 రూపాయలు.. మార్కెట్‌లోకి నయాదందా! నమ్మారంటే ఇక అంతే!
Black Money Fraud

Edited By:

Updated on: Jun 17, 2026 | 8:03 AM

రూపాయికి 3 రూపాయలు ఇస్తామంటూ ఓ రియల్‌ఎస్టేట్ వ్యాపారి నుండి రూ.14లక్షలు కాజేశారు కొందరు కేటుగాళ్లు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. వివరాల్లో కెళ్తే.. స్థానికంగా రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేస్తున్న రవి చంద్రారెడ్డి అనే వ్యక్తికి ఇటీవలే చిల్లకూరుకు చెందిన శ్రీనివాసుస్‌, జీవకోనకు చెందిన గుణశేఖర్‌తో పరిచయం ఏర్పడింది. వీళ్ళ మధ్య పరిచయంలో బ్లాక్ మనీ, రైస్ పుల్లింగ్ వ్యవహారాలు తరచూ చర్చకు రాగా తిరుపతికి చెందిన లక్ష్మీ ప్రియ అనే మహిళ దగ్గర బ్లాక్ మనీ ఉందని రూపాయికి రూ. 3 రూపాయలు వస్తుందని నమ్మించే ప్రయత్నం జరిగింది. లక్ష్మీ ప్రియ అనే మహిళకు గుణశేఖర్ తో బాగా పరిచయం ఉందని బ్లాక్ మనీ చాలామణి చేస్తే తమకు కమిషన్ వస్తుందని రవిచంద్ర రెడ్డికి గాలం వేశారు. ఈ మేరకు లక్ష్మీ ప్రియతో రవిచంద్ర రెడ్డిని ఫోన్‌లో కూడా మాట్లాడించిన గుణశేఖర్, శ్రీనివాసులు పక్కా ప్లాన్ అమలు చేశారు.

ఇందులో భాగంగానే రవి చంద్రారెడ్డిని నమ్మించిన ముఠా రూ. 14 లక్షలు నగదుతో ఏర్పేడు సమీపంలోని మేర్లపాక వద్దకు రమ్మన్నారు. ఈ మేరకు క్యాష్ తో స్పాట్‌కు చేరుకున్న రవిచంద్ర రెడ్డిని కారులో ఎక్కించుకున్న లక్ష్మీ ప్రియా ముఠా దారిలో దాడి చేసి, నగదు లాక్కుంది. కారులో లక్ష్మీ ప్రియతో పాటు ఉన్న మరో ముగ్గురు ముఠా.. ఆర్ మల్లవరం వద్ద కారు నుండి రవిచంద్ర రెడ్డిని తోసివేసి పరారైంది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు ఏర్పేడు పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన విషయం మొత్తం పోలీసులకు చెప్పి ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, శ్రీనివాస్, గుణశేఖర్ అదుపులోకి తీసుకున్నారు.

ఇక నగదుతో పరారైన లక్ష్మీప్రియ, మరో ఇద్దరి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఒకటికి మూడింతలు డబ్బు ఇప్పిస్తామంటే ఆశ పడ్డ డబ్బులు కోల్పోయిన రవి చంద్రారెడ్డిని సైతం పోలీసులు ప్రశ్నించారు. అయితే అతను పొంతనలేని సమాధనాలు చెప్పడంతో అనుమానం వచ్చిన పోలీసులు.. ఇది రైస్ పుల్లింగ్ ముఠాగా అనుమానిస్తున్నారు. ఈ ముఠా గురించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us