చంద్రబాబు బరువు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది!. బాబు బరువు చుట్టే ఇప్పుడు మాటల తూటాలు పేలుతున్నాయ్!. చంద్రబాబు బరువు తగ్గారని టీడీపీ అంటుంటే… కాదుకాదు పెరిగారంటూ ఎదురుదాడికి దిగింది వైసీపీ. అసలు, చంద్రబాబు బరువు ఎందుకు తెరపైకి వచ్చింది?.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చుట్టే తిరుగుతున్నాయి. స్కిల్ స్కామ్ కేసు విషయంలో జైలులో ఉన్న చంద్రబాబునాయుడి ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాబు ప్రాణాలకు హాని తలపెట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం దగ్గర ధర్నాకు యత్నించారు తెలుగు తమ్ముళ్ళు.
టీడీపీ అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరి ట్వీట్ చేయడంతో అసలు కథ మొదలైంది. చంద్రబాబు 5 కేజీల బరువు తగ్గారని భువనేశ్వరి, బ్రహ్మణి అంటే, స్టెరాయిడ్లు ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు నారా లోకేష్. టీడీపీ నేతలు కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. హెల్త్ బులెటిన్స్‌లో సరైన సమాచారం ఇవ్వడం లేదన్నారు యనమల. చంద్రబాబు బరువు తగ్గినట్టు తమకు పక్కా సమాచారం ఉందన్నారు.
దీంతో చంద్రబాబు ఆరోగ్యంపై ఎదురుదాడికి దిగింది అధికార పార్టీ వైసీపీ. బాబు బరువు తగ్గలేదు… కిలో పెరిగారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. అయినా, చంద్రబాబు కోసం ఏసీ పెట్టడానికి జైలేమైనా అత్తారిల్లా అన్నారు. ఇంటి నుంచి తీసుకొస్తున్న ఫుడ్‌లో ఏమేం కలుపుతున్నారో ఎవరికి తెలుసు అంటూ సంచలన కామెంట్స్ చేశారు సజ్జల. మంత్రులు బొత్స సత్యనారాయణ, మేరుగ నాగార్జున కూడా బాబు ఫ్యామిలీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇక మంత్రి అమర్‌నాథ్ అయితే… బాబుకు ఇంటి నుంచి వస్తున్న భోజనాన్ని ముందు లోకేశ్ తినాలని అన్నారు.
చంద్రబాబు జైలుకు వెళ్లి నెల రోజులు దాటిపోయింది. బాబు.. ఓ వైపు బెయిల్ కోసం.. మరోవైపు కేసును క్వాష్ చేయాలంటూ న్యాయ పోరాటం చేస్తున్నారు. అయితే ఇప్పుడు టీడీపీ నేతలు చంద్రబాబు ఆరోగ్య సమస్యపై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. అయితే అధికారులు, వైఎస్సార్సీపీ నేతలు మాత్రం అందులో వాస్తవం లేదని అంటున్నారు. ఇదిలావుంటే ప్రస్తుతం చంద్రబాబు స్కిన్ అలెర్జీ తో బాధ పడుతున్నారు. స్కిన్ స్పెషలిస్టులు వచ్చి పరీక్షించి మందులు ఇస్తున్నారని జైలు అధికారులు అంటున్నారు. బాబు బరువు తగ్గారనడం అబద్దమంటున్నారు. అధికారులు. ఇంటి నుంచి చంద్రబాబుకు ఫుడ్ వస్తుందని, అలాంటప్పుడు వెయిట్ ఎలా తగ్గుతారని ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబసభ్యులు ఆరోపణలు చేయడంతో కోస్తాంధ్ర జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్ వివరణ ఇచ్చారు. బరువు తగ్గారన్న ఆరోపణల్లో నిజం లేదన్నారాయన. చంద్రబాబు జైలుకొచ్చినప్పుడు 66 కిలోలు ఉంటే, ఇప్పుడు 67 కేజీలు ఉన్నారన్నారు. మొత్తానికి, చంద్రబాబు బరువు ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆరోపణలు, కౌంటర్లు, క్లారిఫికేషన్లతో సీన్ హీటెక్కింది. మరి, ఇది ఏ మలుపు తిరుగుతుందో చూడాలి..!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..