
Kurnool: దేగట్టులో కర్రలు కరాళనృత్యం చేశాయి. రక్తం చిందింది. ఆచారమే గెలిచింది. తలలు పగిలినా, గాయాలైనా భక్తులు వెనుకడుగు వేయలేదు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయం పేరుతో దేవరగట్టు కొండపై మరోసారి బన్నీ సమరం రక్తసిక్తమైంది. ఈ కర్రల సమరంలో ఒకరు మృతి చెందగా, 100 మందికిపైగా గాయాలైనట్లు సమాచారం. అయితే మరి కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుడు ఆలూరుకు చెందిన పోతురాజు (32) గుర్తించారు. మాలమల్లేశరస్వామి ఉత్సవ ఊరేగింపులో ఈ హింస చెలరేగింది. కర్రలు, దివిటీలు తిప్పే క్రమంలో కొందరి తలలు పగిలినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ విక్రాంత్ స్వయంగా రంగంలోకి దిగారు. ఈ కర్రల సమరంలో 11 గ్రాముల ప్రజలు పాల్గొన్నారు.
తరతరాలుగా వస్తున్న సంప్రదాయం పేరుతో దేవరగట్టు కొండపై మరోసారి బన్నీ సమరం రక్తసిక్తమైంది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలంలో ప్రసిద్ధి గాంచిన దేవరగట్టు మాల మల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవాలు అర్ధరాత్రి ఉత్కంఠ భరితంగా జరిగాయి.
వేలాదిగా తరలివచ్చిన భక్తుల మధ్య స్వామివారి జైత్రయాత్ర సాగింది. దేవరగట్టు కొండపై అర్ధరాత్రి దాటిన తర్వాత బన్ని ఉత్సవాల సందడి మొదలైంది. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత వేద పండితులు మాల మల్లేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను పల్లకిలో కొండపై నుంచి కిందకు తీసుకొచ్చి సింహాసన కట్ట దగ్గరకు చేర్చారు. అక్కడ మహా మంగళహారతి నిర్వహించారు. ఆ తరువాత అసలు యుద్ధం మొదలైంది. ఉత్సవ మూర్తులను ఆధీనంలోకి తీసుకునేందుకు 11 గ్రామాలకు చెందిన భక్తులు కర్రలతో రంగంలోకి దిగారు. సంప్రదాయ నినాదాలతో కొండ ప్రాంతం మార్మోగింది. కాగడాల వెలుగులో వేలాది కర్రలు గాల్లోకి లేశాయి. సుమారు గంటకుపైగా ఈ సమరం సాగింది. తీవ్రంగా గాయపడిన వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్లో చికిత్స చేశారు. సుమారు 800 అడుగుల ఎత్తులో ఉన్న దేవరగట్టు కొండపై అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఉత్సవాలు కొనసాగాయి. రాష్ట్రంతోపాటు కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు.
పూర్వ కాలంలో ఆత్మరక్షణ కోసం, శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడం కోసం ఈ కర్రసామును నేర్చుకునేవారు. సంక్రాంతి, దసరా వంటి పెద్ద పండుగలలో లేదా ఊరి జాతరల సమయంలో ఈ కర్రల సాము ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ యువతకు ఈ విద్యను నేర్పించే సంప్రదాయం కొనసాగుతోంది. ప్రతి యేటా ఈ కర్రల సమరంలో ఎంతో మంది గాయపడుతున్నారు.