Srikalahasti: పోలీస్ కాలర్ పట్టుకున్నాడు.. కత్తితో బెదిరించాడు.. కట్ చేస్తే..

శ్రీకాళహస్తిలో ఇద్దరు యువకులు విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్‌పై దౌర్జన్యానికి పాల్పడ్డారు. కాలర్ పట్టుకుని దాడికి ప్రయత్నించడంతో పాటు కత్తితో బెదిరించారు. పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసి హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం ఆన్‌లైన్‌లో కత్తి కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైంది.

Srikalahasti: పోలీస్ కాలర్ పట్టుకున్నాడు.. కత్తితో బెదిరించాడు.. కట్ చేస్తే..
Srikalahasti Police

Edited By:

Updated on: Aug 13, 2026 | 10:16 AM

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. ఏకంగా విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్‌ కాలర్ పట్టుకుని దాడికి ప్రయత్నించడమే కాకుండా.. కత్తితో బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై జిల్లా పోలీస్ యంత్రాంగం సీరియస్‌గా స్పందించింది. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ సమీపంలో ల్యాప్‌టాప్ చోరీకి గురైనట్లు డయల్‌-100కు సమాచారం అందింది. దీంతో శ్రీకాళహస్తి వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ రమణయ్య ఘటనాస్థలానికి వెళ్లారు. అదే సమయంలో రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన బైక్ తాళాలను హెడ్ కానిస్టేబుల్‌ తీసుకోవడంతో యువకులు ఆగ్రహానికి గురయ్యారు.

శ్రీకాళహస్తి కొండమిట్టకు చెందిన జితేంద్ర, శ్రీనివాస్‌.. హెడ్ కానిస్టేబుల్‌ రమణయ్యతో వాగ్వాదానికి దిగి, ఆయన కాలర్ పట్టుకుని దాడికి ప్రయత్నించారు. అంతటితో ఆగకుండా కత్తి తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. యూనిఫాంలో ఉన్న పోలీసుపై యువకులు దౌర్జన్యంగా వ్యవహరించడంపై పోలీసులు వెంటనే స్పందించి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

హెడ్ కానిస్టేబుల్‌ రమణయ్య ఫిర్యాదు మేరకు జితేంద్ర, శ్రీనివాస్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యాయత్నం కేసు నమోదు చేసి ఇద్దరినీ అరెస్టు చేశారు. అనంతరం అడిషనల్‌ ఎస్పీ రవి మనోహరాచారి ఎదుట నిందితులను హాజరుపరిచారు. విచారణలో శ్రీనివాస్‌పై గతంలోనూ ఓ కేసు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ చేస్తూ వైరల్ కావాలనే ఉద్దేశంతోనే నిందితులు ఆన్‌లైన్‌లో కత్తిని కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం.

అనంతరం నిందితులను పోలీసులు శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా నడిపించుకుంటూ కోర్టుకు తరలించారు. స్వర్ణముఖి వంతెన నుంచి పెళ్లి మండపం వరకు చేతులకు బేడీలు వేసి నిందితులను నడిపించడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకుని చూశారు. ఆ తర్వాత నిందితులను పోలీసు వాహనంలో సత్యవేడు కోర్టుకు తరలించి హాజరుపరిచారు.

Loading...
Unable to load recommendations.
Follow Us