
ఏలూరు : ప్రకృతి సృష్టించిన విలయానికి పశ్చిమ గోదావరి జిల్లా అతలాకుతలమైంది. ఉద్ధృతమైన ఈదురుగాలులు, తుఫాన్ ప్రభావంతో 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్లు చిన్నాభిన్నం కాగా.. వందలాది విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఫలితంగా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో గత నాలుగు రోజులుగా కరెంట్ లేక అంధకారం అలుముకుంది. ఇళ్లలో బిగించిన ఇన్వర్టర్లు సైతం డెడ్ కావడంతో ప్రజలు చీకట్లోనే కాలం వెళ్లదీయాల్సివస్తోంది. మరోవైపు ఉక్కబోత, చిన్నారుల రోదనలు, నిద్రలేని రాత్రులు ఆ కుటుంబాలను మానసికంగా కుంగదీస్తున్నాయి. అత్యవసర అవసరాలకు వాడే మొబైల్ ఫోన్లకు ఛార్జ్ చేసే అవకాశం కూడా లేకపోవడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన పరిస్థితి నెలకొంది. కరెంట్ ఎప్పుడు వస్తుందో స్పష్టత లేని దయనీయ స్థితిలో, ప్రజలు తమ ఇళ్లలోని బరువైన ఇన్వర్టర్ బ్యాటరీలను బండ్లపై, ఆటోలపై ఎక్కించుకుని ఎలక్ట్రికల్ షాపుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
పాలకొల్లు పరిసర ప్రాంతాల నుంచి భగ్గేపురం తదితర ప్రాంతాల్లో తెరిచి ఉన్న కొద్దిపాటి దుకాణాల వద్దకు జనం బారులు తీరుతున్నారు. గంటల తరబడి పడిగాపులు కాస్తూ తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆపద్బాంధవులుగా నిలవాల్సిన కొందరు వ్యాపారులు కొత్త వ్యాపారానికి తెరలేపారు. ప్రజల నిస్సహాయతను, అత్యవసర పరిస్థితిని ఆసరాగా చేసుకుని నిలువుదోపిడీకి పాల్పడుతున్నారు. కేవలం ఒక్క బ్యాటరీ రీచార్జ్ చేయడానికి ఏకంగా రూ. 400 వరకు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే తుఫాన్ దెబ్బకు ఆర్థికంగా నష్టపోయి, కనీస సదుపాయాలు లేక అల్లాడిపోతున్న సామాన్యులపై ఈ రేంజ్‌లో వసూలు చేస్తున్న ఛార్జీలు గుదిబండలా మారుతున్నాయి. గంటల ఛార్జింగ్ కోసం.. రూ.100ల నుంచి 400 వరకు వసూలు చేస్తుండటం సంచలనంగా మారింది.
ఈ సంక్షోభంపై విద్యుత్ శాఖాధికారులు స్పందిస్తూ… నేలకూలిన స్తంభాలను, దెబ్బతిన్న లైన్లను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నామని చెబుతున్నారు. అయితే నష్టం తీవ్రత ఎక్కువగా ఉండటంతో విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో సాధారణ స్థితికి రావడానికి మరో రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు, ప్రజల బలహీనతను క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ వ్యాపారుల అక్రమ వసూళ్లపై యంత్రాంగం దృష్టి సారించి, తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.