Andhra Pradesh: పోలీసులు చేసిన చిన్న పనితో కామాంధుడికి కఠిన శిక్ష.. నేరం ఎలా బయటపడిందో తెలుసా..?

ఒక చిన్న అవగాహన.. ఒక నిండు జీవితంలో వెలుగులు నింపడమే కాదు, ఒక నేరస్తుడి అంతం చూసింది.. పోలీసులు పాఠశాలల్లో నిర్వహించిన బ్యాడ్ టచ్ క్లాస్, నాలుగేళ్ల క్రితం ఒక బాలికలో నింపిన ధైర్యం నేడు గెలిచింది. కన్నకూతురిపై కన్నేసి, దయ్యం పట్టిందంటూ నాటకాలాడిన కామాంధుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.

Andhra Pradesh: పోలీసులు చేసిన చిన్న పనితో కామాంధుడికి కఠిన శిక్ష.. నేరం ఎలా బయటపడిందో తెలుసా..?
Bad Touch Awareness Program

Edited By:

Updated on: May 11, 2026 | 1:10 PM

పోలీసులు చేపట్టిన బ్యాడ్ టచ్ అవగాహన సదస్సులు సత్ఫలితాలను ఇస్తున్నాయి. పాఠశాల స్థాయి నుంచే చిన్నారులకు తమ రక్షణ గురించి అవగాహన కల్పించడం వల్ల.. ఏళ్ల తరబడి మౌనంగా హింసను భరిస్తున్న బాధితులు నేడు ధైర్యంగా గొంతు విప్పుతున్నారు. తాజాగా చిలకలూరిపేటలో ఓ బాలిక చూపిన ధైర్యం, ఆ కామాంధుడిని కటకటాల వెనక్కి నెట్టడమే కాకుండా అతనికి జీవిత ఖైదు పడేలా చేసింది. పత్తి మిల్లులో కూలీగా పనిచేసే ఓ మహిళ, తన భర్తతో విభేదాల కారణంగా తన 12 ఏళ్ల కూతురితో కలిసి ఒంటరిగా నివసిస్తోంది. ఈ క్రమంలో పెయింటర్‌గా పనిచేసే ఓ వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడి, ఆ తర్వాత వారు వివాహం చేసుకున్నారు. అయితే తల్లి మిల్లుకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న బాలికపై ఆ వ్యక్తి కన్నేశాడు. వరుసగా లైంగిక దాడులకు పాల్పడుతూ నరకం చూపించాడు. ఒకసారి తల్లికి అనుమానం వచ్చి నిలదీయగా.. తనకు దయ్యం పట్టిందని నమ్మించి నాటకాలాడాడు. ఆరు నెలల పాటు ప్రార్థనలు చేయించినా అతని బుద్ధి మారలేదు. తల్లి లేని సమయంలో బాలికపై పైశాచికత్వాన్ని కొనసాగించాడు.

పోలీసుల చొరవ.. బాలిక ధైర్యం

2019లో చిలకలూరిపేటలోని ఆ బాలిక చదువుతున్న పాఠశాలకు పోలీసు బృందం వెళ్లింది. ఆ బృందంలోని కానిస్టేబుల్ సరోజ, విద్యార్థినులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ గురించి కళ్లకు కట్టినట్లు వివరించారు. ఎవరైనా తప్పుగా తాకితే ఎలా స్పందించాలో నేర్పారు. ఆ కానిస్టేబుల్ మాటలు విన్న బాలికలో ధైర్యం వచ్చింది. తనపై తండ్రి వరసైన వ్యక్తి చేస్తున్న అకృత్యాలను కానిస్టేబుల్ సరోజకు వివరించింది. వెంటనే స్పందించిన సరోజ.. ఆ బాలికను తల్లి వద్దకు తీసుకెళ్లి విషయాన్ని వివరించారు. తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

న్యాయస్థానం సంచలన తీర్పు

ఈ కేసును విచారించిన జడ్జి పర్వీన్ సుల్తానా బేగం, నిందితుడిపై నేరం నిరూపణ కావడంతో కఠినమైన తీర్పును వెలువరించారు. నిందితుడికి జీవిత ఖైదు, 5 వేల రూపాయల జరిమానా. బాధితురాలి భవిష్యత్తు కోసం ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల పరిహారం అందించాలని జడ్జి ఆదేశించారు. ఈ తీర్పు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులపై అకృత్యాలకు పాల్పడితే చట్టం నుండి తప్పించుకోవడం అసాధ్యమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Follow Us