Srikalahasti: శివరాత్రి వేళ తెలుగు రాష్ట్రాల భక్తులకు శుభవార్త.. శ్రీకాళహస్తిలోనూ..

శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ రోడ్డును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. వర్చువల్ విధానంలో దీనిని ప్రారంభించారు. ఈ సందర్బంగా దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి సూచనతో త్వరలోనే శ్రీకాళహస్తి స్వామివారి దర్శనం చేసుకోనున్నట్లు స్పష్టం చేశారు. ఆలయాల అభివృద్దిక కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

Srikalahasti: శివరాత్రి వేళ తెలుగు రాష్ట్రాల భక్తులకు శుభవార్త.. శ్రీకాళహస్తిలోనూ..
Srikalahasti

Updated on: Feb 13, 2026 | 4:39 PM

ప్రస్తుతం తమిళనాడులోని అరుణాచలం దేవాలయంలో గిరి ప్రదక్షిణ చేసే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల నుంచి వేలామంది మంది భక్తులు అరుణాచలం వెళ్తుంటారు. అక్కడ గిరి ప్రదక్షిణ నిర్వహించి అనంతరం స్వామివారిని దర్శించుకుంటారు. గిరి ప్రదక్షిణకు అరుణాచలం అనేది దక్షిణ భారతదేశంలో బాగా పాపులర్ అయిపోయింది. ఇక మహాశివరాత్రి సందర్భంగా అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే శ్రీకాళహస్తిలో కూడా గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీకాళహస్తిలో నూతనంగా నిర్మించిన గిరిప్రదక్షిణ రోడ్డును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర సచివాలయం నుంచి శుక్రవారం వర్చవల్‌గా ప్రారంభించారు. దాదాపు రూ.10 కోట్ల వ్యయంతో ఈ రోడ్డును నిర్మించారు. మహాశివరాత్రికి రెండు రోజుల ముందు ఈ గిరి ప్రదక్షిణ రోడ్డును ప్రారంభించడం ఆనందంగా ఉందని పవన్ స్పష్టం చేశారు.

శ్రీకాళహస్తిలో కూడా గిరి ప్రదక్షిణ

అరుణాచలం తరహాలో శ్రీకాళహస్తిలో కూడా ప్రతీ పౌర్ణమికి గిరి ప్రదక్షిణ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. శివరాత్రి తర్వాత శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణ మార్గంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. 22 కిలోమీటర్లు ఉన్న ఈ గిరి ప్రదక్షిణ మార్గాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. రహదారికి రెండు వైపులా మొక్కలు నాటుతామని, అటవీశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. శ్రీకాళహస్తి గిరిప్రదక్షిణ చేస్తే కైలాసగిరి గిరిప్రదక్షిణ చేసిన పుణ్యంఫలం దక్కుతుందని, త్వరలో తాను కూడా శ్రీకాళహస్తిని దర్శించుకుంటానని అన్నారు.

అరుచాలంలో గిరి ప్రదక్షిణ చేయాలని ఉంది

అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేయాలనే కోరిక తనకు కూడా ఉందని, అక్కడి గిరిప్రదక్షిణ గురించి తెలుసుకున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఆలయాలను రక్షించుకోవాల్సిన అవసరముందని, పాలకమండళ్లు బాధ్యతగా వ్యవహరిస్తే ఎలాంటి అపచారాలు జరగవన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో ఎన్నో అపచారాలు జరిగాయని, అప్పటి పాలకమండలి బాధ్యతగా ఉంటే అవి జరిగేవి కాదన్నారు. తమ ప్రభుత్వంలో ఏర్పాటు అయిన ఆలయాల పాలకమండళ్లు బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. అటు కొటప్పకొండ ఆలయం పరిసర ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. రాష్ట్రంలో పంచాయతీ రాజ్ నిధులతో 22 ప్రధాన దేవాలయలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను అభివృద్ది చేసే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. దేవాలయాల పరిరక్షణకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినట్లు తమ ప్రభుత్వంలో ఆలయాలపై దాడులు జరిగితే సహించేది లేదన్నారు.