
స్థానిక ఎన్నికల వేళ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం అలీనగర్ లో విచిత్ర పరిస్థితి నెలకొంది. గ్రామంలో రోడ్డును విభజన రేఖగా మార్చి ఒక వైపు దుగ్గిరాల పంచాయితీలో మరొకవైపు కొలకలూరు పంచాయితీలో ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. దుగ్గిరాల గ్రామ పంచాయితీ పరిధిలోని చివరి కాలనీ అలీనగర్. అలీ నగర్ కాలనీని యాభై ఏళ్ల క్రితమే కొలకలూరు పంచాయితీలో కలిపారు. దీంతో అలీనగర్ పంచాయితీ కొలకలూరులో ఉంది. రోడ్డు అటు పక్క దుగ్గిరాలలో ఉంటే ఇటు పక్క కొలకలూరు పంచాయితీలో ఉంటుంది. కొలకలూరు పంచాయితీ తెనాలి రూరల్ మండలం పరిధిలోకి వస్తుంది. ఇక దుగ్గిరాల పంచాయితీ దుగ్గిరాల మండలంలోనే ఉంటుంది.
అలీనగర్ వాసులు బర్త్, డెత్ సర్టిఫికేట్స్ తో పాటు పంచాయితీ కార్యాలయంలో ఏ చిన్న పని ఉన్నా కొలకలూరు పంచాయితీకి వెళ్లాల్సి ఉంటుంది. అదే విధంగా కొలకలూరు పంచాయితీ తెనాలి రూరల్ మండలంలో ఉంటుంది. తహశీల్థార్ కార్యాలయం కళ్ల ముందే కనిపిస్తున్నా ఏడు కిలో మీటర్ల దూరంలో ఉన్న తెనాలి వెళ్లాల్సి ఉంటుంది. ఈక్రమంలోనే తమ కాలనీని దుగ్గిరాల పంచాయితీలో కలపాలని ఎప్పటి నుండో స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఐదు వందల పైచిలుకు ఓట్లున్న అలీ నగర్ 190 ఓట్లు కొలకలూరు పంచాయితీ పరిధిలోకి వస్తుంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయాలంటే కొలకలూరు వెళ్లాల్సిందే.. గతంలో ఎప్పుడో జరిగిన తప్పును సరి చేయాలని ఇప్పటికీ స్థానికులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఎన్నికల సమయంలో అన్ని పార్టీల నేతలు హమీలిస్తున్నా ఇప్పటి వరకూ తమ సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు అంటున్నారు.
ఇక పల్నాడు జిల్లాలోని రాజుపాలెం, గంగిరెడ్డి పాలెం పంచాయితీలది ఇదే పరిస్థితి. రోడ్డుకు ఒక వైపున రాజుపాలెం పంచాయితీ ఉంటుంది. మరొక వైపు గంగిరెడ్డిపాలెం పంచాయితీ ఉంటుంది. రాజుపాలెం పంచాయితీ రాజుపాలెం మండల కేంద్రంలో ఉంటే గంగిరెడ్డిపాలెం పంచాయితీ బెల్లంకొండ మండలంలో ఉంటుంది. రాజుపాలెం మండలం సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉంటే బెల్లంకొండ మండలం పెదకూరపాడు నియోజకవర్గంలో ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలైన జెడ్పిటీసి, ఎంపిటిసి ఎన్నికల్లో గంగిరెడ్డి పాలెం ఓటర్లు బెల్లంకొండ పరిధిలోకి వస్తున్నారు. ఎదురుగా రాజుపాలెం మండలం కేంద్రం ఉన్నా ఏ చిన్న పనికైనా నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉన్న బెల్లంకొండ వెళ్లడం పరిపాటైపోయింది గంగిరెడ్డిపాలెం స్తానికులుకు…
ఇలా రోడ్డే విభజన రేఖగా మారిపోయిన విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్న స్తానికలు ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలోనైనా తమను సమీపంలోన ఉన్న పంచాయితీ లేదా మండల కేంద్రంలో కలిపితే సమస్య పరిష్కారం అవుతుందని కోరుతున్న నేపధ్యం కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని స్థానిక సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..