
కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి, స్థానికులు, చరిత్రాభిమానుల బృందంతో కలిసి కొండవీడు కోటలోని అత్యంత ఎత్తైన రుద్రపాద శిఖరాన్ని అధిరోహించి అక్కడ మరో పురాతన శాసనాన్ని గుర్తించారు. కొండవీడు కోట 42 కొండల సమాహారంగా ప్రసిద్ధి చెందింది. వీటిలో అత్యంత ఎత్తైన శిఖరం రుద్రపాదం. ముస్లిం పాలన అనంతరం దీనిని ఆదం షఫీ బోడు అని కూడా పిలుస్తున్నారు. ఈ పర్వత శిఖరానికి హిందువులతో పాటు ముస్లింలు కూడా భక్తిపూర్వకంగా వెళ్లి పూజలు నిర్వహిస్తూ ఉంటారు.
రుద్రపాద శిఖరంపై రుద్రపాద చిహ్నంతో పాటు రెండు పురాతన శివాలయాలు ఉన్నాయి. ఇవి క్రీస్తుశకం 14–15వ శతాబ్దాల్లో, అంటే రెడ్డి రాజుల కాలంలో నిర్మించబడినవిగా భావిస్తున్నారు. కాలక్రమేణా ఈ ఆలయాలు శిథిలావస్థకు చేరగా, అసాంఘిక శక్తులు నిధుల కోసం తవ్వకాలు చేపట్టడంతో మరింత ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం ఒక శివాలయం పూర్తిగా కూలిపోయి గర్భగుడి మాత్రమే మిగిలి ఉంది. గర్భగుడి ముందు ఉన్న ద్వారపాలకుల స్తంభాలలో ఒకటి సగం విరిగిపోయి ఉండగా, దానిపైనే ఈ శాసనం చెక్కబడి ఉంది.
శాసనాన్ని పరిశీలించిన కల్లి శివారెడ్డి, ప్రాథమికంగా కొంత పాఠాన్ని చదివి, పూర్తి వివరాల కోసం మైసూరులోని పురావస్తు పరిశోధకులు, మాజీ పురావస్తు శాఖ డైరెక్టర్ శ్రీ మునిరత్నం రెడ్డికి పంపించారు. ఆయన అధ్యయనం ప్రకారం శాసనంలోని పాఠ్యంలో “భట్లకు నాలుగు వృత్తులు, విరూపాక్ష దీక్షితులకు రెండు వృత్తులు ధారవోసి ఇచ్చినట్లు”, అలాగే “శ్రీ కైలాస శివాయ నమః” అనే పదాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా “శ్రీశ్రీశ్రీ పర్వతం, ఔభళ పంచారామలు” అనే ప్రస్తావన కూడా ఉన్నట్లు తెలిపారు.
ఈ శాసనం ఒక దాన శాసనం అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆ కాలంలో దేవాలయాలకు లేదా అర్చకులకు ఇచ్చే దానాలను “వృత్తులు” అనే భాగాలుగా విభజించి అందించడం ఆనవాయితీగా ఉండేదని, ముఖ్యంగా రెడ్డి రాజుల శాసనాల్లో ఇటువంటి విధానం తరచుగా కనిపిస్తుందని శివారెడ్డి వివరించారు. శాసన లిపి ఆధారంగా ఇది క్రీస్తుశకం 14–15వ శతాబ్దాల నాటిదిగా, రెడ్డి రాజుల కాలానికి చెందినదిగా పురావస్తు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అనవేమారెడ్డి లేదా పెదకోమటి వేమారెడ్డి పాలనలో ఈ శాసనం జారీ అయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
దీనికి సమీపంలో ఉన్న బొల్లుమోర వెంకటేశ్వరస్వామి ఆలయం ఈ అభిప్రాయానికి బలం చేకూరుస్తోంది. కొండవీటి కైఫియత్తుల ప్రకారం పెదకోమటి వేమారెడ్డి ఈ ఆలయానికి అనేక దానాలు, జేగంటలు సమర్పించినట్లు తెలుస్తోంది. అలాగే అనవేమారెడ్డిని “షట్‌కాల శివపూజా దురంధరుడు”గా శాసనాలు వర్ణిస్తున్నాయి. రోజుకు ఆరు సార్లు శివారాధన నిర్వహించేవాడనే అర్థంతో ఈ బిరుదు ఉపయోగించబడింది. ఆయన కాలంలో పంచారామ క్షేత్రాల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుని, నిత్య ధూపదీప నైవేద్యాలు నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు శాసన ఆధారాలు చెబుతున్నాయి.
అయితే ప్రస్తుతం లభించిన శాసనం విరిగిపోయిన స్థితిలో ఉండటంతో, ప్రారంభ భాగం లభిస్తేనే ఇది ఏ సంవత్సరంలో జారీ అయింది, ఏ రాజు జారీ చేశాడు అనే విషయాలను ఖచ్చితంగా నిర్ధారించవచ్చని పురావస్తు శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయినప్పటికీ, లిపి శైలి మాత్రం రెడ్డి రాజుల కాలానికే చెందినదని స్పష్టంగా తెలుస్తోందని వారు అంటున్నారు.
కల్లి శివారెడ్డి, స్థానికుడు కొండెబోయిన వెంకటేశ్వర్లు, గుంటూరుకు చెందిన మందాల నాగవర్ధన్ రెడ్డి.. వారి మిత్రులతో కలిసి రుద్రపాద శిఖరానికి చేరుకుని శాసనాన్ని పరిశీలించి, దాని ప్రతిని సేకరించి పురావస్తు నిపుణులకు పంపించారు.
ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ, కొండవీడు కోటలో ఇంకా అనేక శాసనాలు గుర్తింపుకు నోచుకోకుండా ఉన్నాయని తెలిపారు. పురావస్తు శాఖ ప్రత్యేక బృందాన్ని నియమించి ఈ శాసనాలన్నింటినీ సర్వే చేసి, లిపులను నమోదు చేస్తే కొండవీడు చరిత్రలో ఇంకా వెలుగులోకి రాని ఎన్నో అంశాలు ప్రపంచానికి, భవిష్యత్ తరాలకు తెలిసే అవకాశం ఉంటుందని అన్నారు. అలాగే, 2024లో తాను కొండవీడు కోటలో ఐదు అజ్ఞాత శాసనాలను వెలుగులోకి తీసుకువచ్చానని, వాటిలో ఒకటి పెదకోమటి వేమారెడ్డి కాలానికి చెందిన శాసనమని గుర్తించామని ఆయన తెలిపారు.