Andhra News: దేశంలోనే ఆ కేసుల్లో ఏపీ టాప్‌లో ఉంది.. NCRB నివేదికలో షాకింగ్ నిజాలు

ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఫేక్ ప్రచారం ఆందోళన కలిగించే స్థాయికి చేరిందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 2024 నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా నమోదైన ఫేక్ న్యూస్ కేసుల్లో దాదాపు 40 శాతం కేసులు ఏపీలోనే నమోదవడం సంచలనంగా మారింది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ఫేక్ ప్రచారం విపరీతంగా పెరిగిందని NCRB స్పష్టం చేసింది.

Andhra News: దేశంలోనే ఆ కేసుల్లో ఏపీ టాప్‌లో ఉంది.. NCRB నివేదికలో షాకింగ్ నిజాలు
Andhra Pradesh Fake News

Edited By:

Updated on: May 08, 2026 | 6:21 PM

2024 సంవత్సరంలో దేశవ్యాప్తంగా మొత్తం 483 ఫేక్ న్యూస్ కేసులు నమోదవగా.. అందులో 203 కేసులు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే నమోదయ్యాయి. దీంతో ఫేక్ న్యూస్ కేసుల్లో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణలో 139 కేసులు నమోదయ్యాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కలిపి దేశవ్యాప్తంగా నమోదైన ఫేక్ న్యూస్ కేసుల్లో దాదాపు 70 శాతం వాటాను కలిగి ఉండటం గమనార్హం. సోషల్ మీడియాలో రాజకీయ అంశాలపైనే కాకుండా మతపరమైన అంశాలు, సామాజిక వివాదాలు, సాధారణ ఘటనలపైనా తప్పుడు ప్రచారాలు భారీగా పెరిగినట్లు నివేదికలో వెల్లడైంది. ఫేక్ పోస్టులు, మోర్ఫింగ్ వీడియోలు, తప్పుడు ప్రచారాలతో ప్రజల్లో గందరగోళం సృష్టించే ఘటనలు అధికమయ్యాయని NCRB పేర్కొంది.

ఇక సైబర్ నేరాల విషయంలోనూ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. 2024లో రాష్ట్రంలో మొత్తం 2,528 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే సైబర్ నేరాలు 8 శాతం పెరిగినట్లు నివేదిక తెలిపింది. ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ యాప్స్, సోషల్ మీడియా బ్లాక్‌మెయిలింగ్, డిజిటల్ ఫ్రాడ్స్ పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం నేరాల పరంగా కూడా ఏపీలో పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు NCRB గణాంకాలు చెబుతున్నాయి. 2024లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,16,076 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా హింసాత్మక నేరాలు భారీగా పెరిగినట్లు నివేదికలో వెల్లడైంది.

మహిళల వేధింపుల కేసుల్లో 3వ స్థానం

మహిళలపై నేరాల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ టాప్ రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే నేరాల్లో రాష్ట్రంలో 2,965 కేసులు నమోదయ్యాయి. మహిళల వేధింపుల కేసుల్లో దేశంలో మూడో స్థానంలో ఏపీ నిలవడం ఆందోళన కలిగిస్తోంది.మానవ అక్రమ రవాణా కేసుల్లోనూ ఆంధ్రప్రదేశ్ దేశంలో మూడో స్థానంలో నిలిచినట్లు NCRB పేర్కొంది. మరోవైపు 2024లో రాష్ట్రంలో మొత్తం 898 హత్య కేసులు నమోదయ్యాయి. అంటే సగటున రోజుకు రెండు నుంచి మూడు హత్యలు జరుగుతున్నట్లు NCRB గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

రోడ్డు ప్రమాదాల్లో 9వ స్థానం

రోడ్డు ప్రమాదాల విషయంలో కూడా ఏపీ దేశంలో 9వ స్థానంలో నిలిచింది. పెరుగుతున్న ప్రమాదాలు, నిర్లక్ష్య డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు ప్రధాన కారణాలుగా అధికారులు భావిస్తున్నారు. NCRB నివేదికతో రాష్ట్రంలో సోషల్ మీడియా దుర్వినియోగం, సైబర్ నేరాలు, మహిళలపై నేరాలు, హింసాత్మక ఘటనలపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. ఎన్నికల సమయంలో ఫేక్ ప్రచారాలను అరికట్టేందుకు కఠిన చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us