
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ పరిధిలోని వేల్పూరు-వేలువెన్ను లాకుల వద్ద స్థానిక జాలర్లకు అరుదైన అదృష్టం వరించింది. వేట కోసం కాలువలో వేసిన వలకు సుమారు 10 కేజీల బరువున్న భారీ ‘పండుగప్ప’ చేప చిక్కింది. భారీ చేప వలలో పడటంతో జాలర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎర్రకాలువ ఉధృతితో భారీ చేపలు పైకి వస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా ఎర్రకాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గోదావరి నదీ పరివాహక ప్రాంతం నుంచి భారీగా చేపలు ఎదురెక్కుతూ కాలువల్లోకి కొట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో స్థానిక మత్స్యకారులు వేలువెన్ను లాకుల వద్ద చేపల వేటకు దిగగా, కొద్దిసేపటికే వల ఒక్కసారిగా బరువుగా లాగడం గమనించారు. తీరానికి లాగి చూడగా ఏకంగా 10 కేజీల పండుగప్ప చేప దర్శనమిచ్చింది.
సముద్రం, నదీ ముఖద్వారాల్లో ఎక్కువగా కనిపించే పండుగప్ప చేపకు మార్కెట్లో విపరీతమైన గిరాకీ ఉంటుంది. దీని రుచి అద్భుతంగా ఉండటంతో మాంసాహార ప్రియులు ఎంత ధరైనా చెల్లించేందుకు ముందుకొస్తారు. తాము పట్టిన ఈ 10 కేజీల చేప బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.6,000 నుంచి రూ.8,000 వరకు పలుకుతుందని జాలర్లు సంతోషం వ్యక్తం చేశారు. కాలువలో ఇంత భారీ చేప పడిందన్న వార్త దావానలంలా వ్యాపించడంతో లాకుల వద్దకు స్థానికులు భారీగా చేరుకుని చేపను ఆసక్తిగా తిలకించారు.