
వైద్యం కోసం వచ్చిన ఓ మహిళపై ఆర్‌ఎంపీ వైద్యుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడనే ఆరోపణలు ప్రకాశం జిల్లాలో కలకలం రేపుతున్నాయి. సెలైన్‌లో మత్తు మందు ఇచ్చి మహిళపై అఘాయిత్యానికి ప్రయత్నించినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను ప్రతిఘటించినందుకు బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. ఈ ఘటన లింగసముద్రం మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో లింగసముద్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. లింగసముద్రం మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత అనారోగ్యానికి గురికావడంతో అదే గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు నజీర్ వద్దకు వెళ్లింది. ఆమెను పరీక్షించిన నజీర్.. గుండె వేగంగా కొట్టుకుంటోందని, బాగా నీరసంగా ఉందని చెప్పి సెలైన్ ఎక్కించాడు. అనంతరం ఆమె భర్తను మందులు తీసుకురావాలని బయటకు పంపించాడు. ఆ సమయంలో క్లినిక్‌లో మహిళ ఒక్కతే ఉండటంతో.. ఆమెకు ఎక్కుతున్న సెలైన్‌లో మత్తు మందు కలిపినట్లు బాధితురాలు ఆరోపించింది. కొద్దిసేపటి తర్వాత ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. ఆర్‌ఎంపీ వైద్యుడు అత్యాచారానికి ప్రయత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. వైద్యుడి చేష్టలతో స్పృహలోకి వచ్చిన మహిళ అతడిని ప్రతిఘటించింది.
దీంతో ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ నజీర్ బెదిరించినట్లు బాధితురాలు తెలిపింది. అనంతరం ఇంటికి చేరుకున్న మహిళ తన భర్త, కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో వారు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు లింగసముద్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. మరోవైపు వైద్య పరీక్షల కోసం బాధిత మహిళను కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.