
ఇటీవల బడ్జెట్‌లో ఏపీకి రేర్ ఎర్త్ కారిడార్‌తో పాటు పోలవరం, అమరావతి, అరకులో టూరిజం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. అలాగే ఏపీ మీదుగా బుల్లెట్ రైల్ కారిడార్లను కూడా ప్రతిపాదించింది. బుల్లెట్ రైల్ కారిడార్లతో ఏపీకి ప్రయోజనం చేకూరనుండగా.. కేంద్రానికి ఏపీ నుంచి మరో రిక్వెస్ట్ వెళ్లింది. కడప-బెంగళూరు మధ్య కొత్త రైల్వే లైన్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని రాజమండ్రి ఎంపీ పురుదేశ్వరి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు తాజాగా రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఆమె కోరారు. ఈ సందర్భంగా రైల్వే లైన్ ప్రాజెక్టు పనులపై చర్చించారు. కడప-బెంగళూరు మధ్య రైల్వే లైన్ నిర్మిస్తే రాయలసీమ ప్రాంత అభివృద్దికి సహాయపడుతుందని కోరారు. ఈ ప్రాజెక్టుపై పరిశీలన చేపట్టి పనులు వేగవంతం చేయాలన్నారు. ఈ సమవేశంలో ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ కూడా ఉన్నారు.
కడప-బెంగళూరు రైల్వే లైన్ ప్రాజెక్ట్ 2008లోనే మంజూరైంది. ఈ ప్రాజెక్టులో భాగంగా కేవలం కడప-పెండ్లిమర్రి మధ్య మాత్రమే పనులు పూర్తి చేశారు. ఆ తర్వాత పనులు ఆగిపోయాయి. దాదాపు 266 కిలోమీటర్ల మేర ఈ రైల్వే లైన్ నిర్మించాల్సి ఉండగా.. ఇది పూర్తైతే కొప్పర్తి మెగా ఇండస్ట్రీయల్ పార్క్‌కు రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ఈ పనులను వేగంతం చేయాలని, పనులను పరిశీలించాలని పురందేశ్వరి కోరారు. ఇది పూర్తి కావడం వల్ల పరిశ్రమలు వస్తాయని, దీని వల్ల స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
కడప-బెంగళూరు రైల్వే లైన్ పులివెందుల మీదుగా వెళుతుంది. ముద్దనూరు నుంచి పులివెందుల, ముదిగుబ్బ, శ్రీసత్యసాయి మీదుగా వెళుతుంది. రూ.2 వేల కోట్లతో 110 కి.మీ సంబంధించిన పనులు త్వరలో మొదలవుతాయని భావిస్తున్నారు. ఈ ట్రైన్ అందుబాటులోకి వస్తే రాయలసీమ ప్రాంత ప్రజలు సులువుగా బెంగళూరుకు చేరుకోచ్చు. కడప నుంచి బెంగళూరుకు నేరుగా రైల్వే నెట్వర్క్ అనుసంధానం కావడం వల్ల పరిశ్రమ వర్గాలకు కూడా లాభం జరగనుంది. సరుకు రవాణా మరింత వేగవంతం కానుంది. అలాగే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టుపై ముందడుగు త్వరలో పడే అవకాశం కనిపిస్తుంది. ఇదే జరిగే రాయలసీమ ప్రాంత ప్రజలకు మరింత ప్రయోజనం కలగనుంది.