Kopparthi Industrial Hub: కడప జిల్లా కోప్పర్తి.. ఇక, కేరాఫ్ ఇండస్ట్రియల్ హబ్.. యువతకు ఉద్యోగాల వెల్లువ.!

|

Jul 31, 2021 | 10:06 PM

కడప జిల్లాలోని కోప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్క్ కేంద్రంగా పారిశ్రామిక రంగం పరుగులు పెడుతుంది. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు..

Kopparthi Industrial Hub: కడప జిల్లా కోప్పర్తి.. ఇక,  కేరాఫ్ ఇండస్ట్రియల్ హబ్.. యువతకు ఉద్యోగాల వెల్లువ.!
Koparthi Industrial Hub
Follow us on

Kadapa District Kopparthi – Industrial Hub: కడప జిల్లాలోని కోప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్క్ కేంద్రంగా పారిశ్రామిక రంగం పరుగులు పెడుతుంది. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ప్రత్యేకంగా రాయితీలు కల్పించడంతో పాటు అవసరమైన అన్ని వనరులను అందిస్తుండడంతో అందరి దృష్టి కొప్పర్తిపై మళ్లింది. ఇందులో భాగంగా సుమారు రూ.25 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, అందుకు అనుగుణంగా 2.50 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని సంకల్పించే దిశగా అడుగులు వేస్తుంది. ఇంతకీ ఈ కోప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ లో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎన్ని రాబోతున్నాయి. ప్రస్తుతం కోప్పర్తి లో జరుగుతున్న పనుల పురోగతి పై టీవీ9 ప్రత్యేక కథనం.

దశాబ్ద కాలంగా ఎలాంటి పురోగతి లేకుండా నిర్మానుష్యంగా ఉన్న కడప జిల్లాలోని కొప్పర్తి పారిశ్రామికవాడకు మహర్ధశ పట్టింది. పెద్ద పరిశ్రమలు తో పాటు కొన్ని ఫార్మా కంపెనీలు,చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కడప జిల్లాను పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి 2007లో వైఎస్సార్ హయాంలో చింతకొమ్మదిన్నె మండలం కొప్పర్తి వద్ద ఏపీఐఐసీ ద్వారా ఏడు వేల ఎకరాలను సేకరించారు. ఇప్పటివరకు ఆరు చిన్న పరిశ్రమలు మినహా పెద్ద కంపెనీలు ఇక్కడ ఏర్పాటు కాలేదు. దాదాపు దశాబ్ధ కాలం పాటు కొప్పర్తి పారిశ్రామికవాడ నిర్మానుష్యంగా ఉంది.

అయితే సీఎం జగన్ సొంత జిల్లా కావడంతో కొప్పర్తి పారిశ్రామికవాడ అభివృద్ధి దస్త్రాలు చకచకా కదులుతున్నాయి. ప్రధానంగా ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రానిక్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తుండటంతో పాటు మరిన్ని పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా సుమారు రూ.25 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, అందుకు అనుగుణంగా 2.50లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని సంకల్పించారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించి పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తున్నారు.

అయితే, ప్రస్తుతం ఈ కోప్పర్తి కేంద్రంగా వచ్చిన పరిశ్రమలు, రాబోతున్న పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు వివరాలకు వస్తే….కోప్పర్తి లో 2007 సంవత్సరం లో దాదాపు 7000 ఎకరాలు అప్పటి ప్రభుత్వం భూమిని సేకరించారు. అయితే ఈ 7000 ఎకరాల ఉన్న ప్రాంతాన్ని జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ గా నామకరణం చేశారు. దీని కేంద్రంగా సుమారు 25 వేల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా కొనసాగుతుంది. దీని ద్వారా 2 లక్షల 50 వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు రానున్నాయి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈఎంసి కి అక్షరాల 750 కోట్లు ఖర్చు చేస్తున్నారు. దీని ద్వారా 50 శాతం గ్రాంట్ లు ఇస్తారు. ప్రస్తుతం కోప్పర్తి లో డిక్సన్ పరిశ్రమ, నీల్ కమల్ పరిశ్రమ,సెల్ కాన్ పరిశ్రమ, తో చిన్న చిన్నవి ఒక డ్రగ్ ఉత్పత్తి పరిశ్రమ, సిమెంట్ పరిశ్రమ తో పాటు మరో 5 ఫార్మా కంపెనీలు రాబోతున్నాయి.

ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం డిక్సన్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడంతో కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్‌ పార్కులోని ఈఎంసీ-3లో నిర్మాణాలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. డిక్సన్‌ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్‌ కంపెనీ ద్వారా అనేక రకాల ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల తయారీకి కొప్పర్తి కేంద్రంగా మారనుంది. డిక్సన్‌ సంస్థ ప్రధానంగా టీవీ, ల్యాప్‌టాప్‌, మొబైల్‌, కెమెరా తదితర వస్తువులను తయారు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 4,000 నుంచి ,5000 మందికి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అదే తరహాలో ఫర్నీచర్‌ తయారీ రంగంలో అగ్రగామిగా ఉన్న నీల్‌కమల్‌ సంస్థ, విద్యుత్తు మోటార్ల తయారీ రంగంలో పేరొందిన పిట్టి ఇంజినీరింగ్‌ సొల్యూషన్‌ సంస్థ కూడా ఇక్కడ పరిశ్రమలు వచ్చాయి. వైఎస్సార్‌ ఎలక్ట్రానిక్స్‌ మ్యానుఫ్యాక్చర్‌ క్లస్టర్‌ ద్వారా మరికొన్ని సంస్థలకు ఆహ్వానం పలుకుతున్నారు.

ఫార్మారంగంలో పేరొందిన పలు ఫార్మా కంపెనీలు, సిలిండర్ల తయారీ పరిశ్రమ, ఆక్సిజన్‌ ప్లాంటును నెలకొల్పేందుకు ఏర్పాట్లు జరగుతున్నాయి. సరకు ఉత్పత్తులను తరలించే కాంకోర్‌ సంస్థకు చెందిన రైలు వ్యాగన్లు తయారు చేసే సంస్థ ముందుకు వచ్చినట్లు తెలిసింది. ప్రభుత్వ ప్రోత్సాహం, వైజాగ్‌ కారిడార్‌లో కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్‌ పార్కు ఉండడంతో ఇక్కడ పరిశ్రమలు పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీనితో పాటు మరికొన్ని కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తో చర్చలు జరుపుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

మరో వైపు కొప్పర్తిలో ఏర్పాటు చేస్తున్న మెగా పారిశ్రామిక పార్కులో పెట్టుబడి పెట్టే సంస్థలకు ప్రత్యేక రాయితీలను ప్రభుత్వం ఇస్తు ఉండడం తో చాలా మంది పారిశ్రామిక వేత్తలు ఉత్సాహం చూపుతున్నారు. ఇందులో నెలకొల్పే యూనిట్లకు రాష్ట్ర పారిశ్రామిక పాలసీ 2021-29లో ఇచ్చే రాయితీలకు అదనంగా మరికొన్ని రాయితీలను అందిస్తోంది. వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రీ యల్ హలో యూనిట్లను ఏర్పాటు చేసే సంస్థలకు పెట్టుబడి వ్యయం తగ్గించేందుకు తొలుత భూమిని 33 సంవత్సరాలకు లీజు పద్ధతిలో ఏపీఐఐసీ కేటా యిస్తుంది.

1. గరిష్టంగా 99 సంవత్సరాల వరకు లీజు పొడిగించుకోవచ్చు.వాణిజ్య పరంగా ఉత్పత్తి ప్రారంభించిన పదేళ్ల తర్వాత భూమిని కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తారు.
2. అమ్మకం,లీజు ఒప్పందాల పై చెల్లించే రిజిస్ట్రేషన్ ఫీజు,ట్రాన్స్ ఫర్ డ్యూటీ,స్టాంప్ డ్యూటీలపై తొలిసారి నూరు శాతం,రెండోసారి నుంచి 50 శాతం తిరిగి చెల్లిస్తారు.
3. 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు ఐదేళ్లపాటు యూనిట్ విద్యుత్ పై రూపాయి సబ్సిడీ ఇస్తారు.. స్థిర మూలధన పెట్టుబడిలో 20 శాతం సబ్సిడీ లేదా గరిష్టంగా రూ .10 కోట్ల సబ్సిడీ, అందించనున్నారు.
4. ఐదేళ్లపాటు 5 శాతం వడ్డీ రాయితీ,ఏడాదికి గరిష్టంగా రూ1.50 కోట్లు.స్థిర మూలధన పెట్టుబడికి సమానంగా 8 ఏళ్లపాటు 100 శాతం ఎపీఎసీ తిరిగి చెల్లింపు.
5. ఐదేళ్లపాటు సరుకు రవాణా వ్యయంలో 25 శాతం సబ్సిడీని ఐదేళ్ల పాటు అందిస్తారు.ఏడాదికి గరిష్టంగా రూ .50 లక్షలు ఇస్తారు..
6. కనీసం రూ .500 కోట్ల పెట్టుబడి,2 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించే సంస్థలను మెగా ప్రాజెక్టులుగా గుర్తించి వాటి వ్యాపారం,ఉద్యోగ కల్పన ఆధారంగా మరిన్ని అదనపు రాయితీలు అందిస్తారు.

కోప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్ లో ఫార్మా కంపెనీ ఏర్పాటు చేసేందుకు భూమి లీజ్ కి తీసుకున్నాం.. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకొని నిర్మాణాలు పూర్తి అవుతున్నాయి..ఇప్పటి వరకు 6 కోట్ల వరకు ఫార్మా కంపెనీ కి ఖర్చు పెట్టాం..ప్రభుత్వం కూడా రాయితీ ఇస్తా అంటూ ఉంది..త్వరలోనే పూర్తి చేసి యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఫార్మా కంపెనీ ఎండి తెలిపారు..

కోప్పర్తి లో 2007 నుంచి భూమి సేకరించాం..కానీ అప్పటి ప్రభుత్వాలు ఏవి పట్టించుకోలేదు..కానీ జగన్ సీఎం అయ్యాక కోప్పర్తి లో పరిశ్రమ లు క్యూ కడుతున్నాయి.చాలా మంది కి ఉపాధి అవకాశాలు తో పాటు కరువు జిల్లా పారిశ్రామిక రంగం గా అభివృద్ధి చెందడం సంతోషం గా ఉందనిఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అంటున్నారు.

ఏది ఏమైనప్పటికి కొప్పర్తి పారిశ్రామికవాడలోని వచ్చిన, వస్తున్న వివిధ కంపెనీల్లో అత్యధిక మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.ప్రత్యక్షంగా ,పరోక్షంగా నిరుద్యోగ యువతకు ఇది గొప్ప సదవకాశం అని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు..ఉద్యోగ అవకాశాలు తో పాటు జిల్లా కూడా అభివృద్ధి చెందుతుందని పలువురు భావిస్తున్నారు.

సురేష్, టీవీ9 తెలుగు ప్రతినిధి, కడప

Read also: High Court: వ్యాక్సిన్ తీసుకుంటేనే అనుమతి, ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 9 వరకు పాక్షికంగా ప్రత్యక్ష విచారణ: హైకోర్టు