ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) పర్యటించారు. అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆయన పరామర్శించారు. రాష్ట్రంలో ఉన్న కౌలు రైతులను ఆదుకునేవారు లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతుల సమస్యలను ప్రభుత్వం గుర్తించాలని.. వారికి అండగా ఉండాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 80 శాతం మంది కౌలు రైతులే ఉన్నారని, ఇప్పటివరకు 3 వేలకు పైగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. కౌలు రైతుల సమస్యలను ప్రభుత్వం గుర్తించకపోవడం వల్లే తాను బయటకు వచ్చినట్లు పవన్ అన్నారు. తాను ఒక్కో మెట్టు ఎక్కాలనుకునేవాడినని.. రాత్రికి రాత్రే ఎక్కడికో వెళ్లాలనుకునే వ్యక్తిని కానని అన్నారు. రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలో మూడో స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీ రెండో స్థానంలో నిలిచిందని వెల్లడించారు. అధికారంలోకి వస్తే ప్రజల కన్నీళ్లు తుడుస్తామన్న జగన్.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల సమస్యల గురించి మాట్లాడుతుంటే మీ నాయకుడు మమ్మల్ని దత్తపుత్రుడు అని అంటున్నాడు. ఇంకొకసారి నన్ను దత్తపుత్రుడు అని అంటే మాత్రం ఊరుకునేది లేదు. ఇలాగే కొనసాగితే సీబీఐ దత్తపుత్రుడు అని అనాల్సి వస్తుంది. కౌలు రైతుల సమస్యలు నేను సృష్టించినవి కాదు. ఒకసారి వచ్చి ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబసభ్యులతో మాట్లాడండి. అసలు సమస్య ఏంటో తెలుస్తుంది. కష్టాల్లో ఉన్నవారంతా నా సొంతవాళ్లే.. నేనేవరికి దత్తతగా వెళ్లను. అనంతపురం సభ తర్వాత నర్సాపురం ఎంపీ నాకు కొన్ని సూచనలు చేశారు. మీరు సరిగ్గా కొన్ని వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు అని అన్నారు. సరిదిద్దుకోవాలని చెప్పారు. వారి సూచన మేరకు నేను సరిదిద్దకుంటాను. నన్ను దత్తత తీసుకుంటే ఎవరూ భరించలేరు.
– పవన్ కల్యాణ్, జనసేన అధినేత
జనసైనికులపై చేయి పడితే ఊరుకునేది లేదని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. తాను ఎంతో సహనం పాటిస్తున్నానని, సహనం కోల్పోతే తనను ఎవరూ ఆపలేరని అన్నారు. గీతా సారాంశాన్ని నమ్మే వ్యక్తినైన తాను.. కర్మ సిద్ధాంతాన్ని పాటిస్తానని వెల్లడించారు. ప్రజలు ముఖ్యమంత్రి పదవి ఇస్తే చేసుకుంటూ పోతానని.. లేకున్నా ప్రజలకు దాసుడిగానే ఉంటానని స్పష్టం చేశారు.