Gold Robbery: వృత్తి సెలూన్.. పార్ట్ టైంగా దొంగతనాలు.. జ్యూవెలరీ షాపులో చోరీ.. 24గంటల్లో ఛేదించిన పోలీసులు

Gold Robbery: విజయనగరం పట్టణం(Vizianagaram ) రవి జ్యూవెలరీ షాపు(ravi jewellers Shop)లో చోరీకి పాల్పడిన నిందితుడ్ని 24గంటల్లోనే పోలీసులు ఛేదించారు. నిందితులను చత్తీస్ ఘడ్(Chhattisgarh) లో అరెస్టు చేసి.. 

Gold Robbery: వృత్తి సెలూన్.. పార్ట్ టైంగా దొంగతనాలు.. జ్యూవెలరీ షాపులో చోరీ.. 24గంటల్లో ఛేదించిన పోలీసులు
Gold Robbery
Surya Kala

|

Feb 26, 2022 | 5:30 PM

Gold Robbery: విజయనగరం పట్టణం(Vizianagaram ) రవి జ్యూవెలరీ షాపు(ravi jewellers Shop)లో చోరీకి పాల్పడిన నిందితుడ్ని 24గంటల్లోనే పోలీసులు ఛేదించారు. నిందితులను చత్తీస్ ఘడ్(Chhattisgarh) లో అరెస్టు చేసి..  చోరీ మిస్టరీని చేధించినట్లుగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక, ఐపిఎస్ శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. విజయనగరంలోని కోళ్ళ బజారు దగ్గర గల రవి జ్యూవెలరీ షాపులో గుర్తు తెలియని దొంగలు ప్రవేశించి, షాపులోగల 8 కిలోల బంగారు ఆభరణాలు (ఒక కోటి 36 లక్షలు విలువైనవి) పోయినట్లుగా షాపు యజమాని కోట రామ్మోహన్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న విజయనగరం 1వ పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఎం. దీపిక,  విజయనగరం సబ్ డివిజన్ ఇన్ చార్జ్ అదనపు ఎస్పీ అనిల్ పులిపాటి, సిసిఎస్ పోలీసులు, క్లూస్ టీం నేర స్థలంను సందర్శించి, నేరం జరిగిన తీరును పరిశీలించారు. సాంకేతిక, భౌతిక ఆధారాలను సేకరించి.. ఈ నేరానికి పాల్పడింది ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులుగా ఒక అభిప్రాయానికి వచ్చారు.

దీంతో  జిల్లా ఎస్పీ ఆదేశాలతో అదనపు ఎస్పీ అనిల్ పులిపాటి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, చత్తీస్ ఘడ్ రాష్ట్రానికి పంపారు. చత్తీస్ ఘడ్ రాష్ట్రం కబీర్ధాం జిల్లా కవర్ధా పట్టణంకు చెందిన లోకేష్ శ్రీవాస్ అనే పాత నేరస్థుడిని చత్తీస్ ఘడ్ పోలీసుల సహకారంతో అతని ఇంటి వద్దనే ఈ నెల 24న అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 6.181 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా పోలీసుల విచారణలో నిందితుడి లోకేష్ శ్రీవాస్ విజయనగరం పట్టణంలో మరో మూడు నేరాలకు పాల్పడినట్లుగా అంగీకరించాడు. దీంతో నిందితుడి వద్ద ఉన్న 90.52 గ్రాముల సిల్వర్ బ్రాస్ లెట్లును, రూ. 15 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. సిఎంఆర్, పాండు జ్యూవెలరీ షాపు మరియు పద్మజ ఆసుపత్రి మెడికల్ షాపులో చోరీలకు పాల్పడిన నిందితుడు అతని అవసరాలకు డబ్బులను ఖర్చు చేసినట్లుగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు. ఈ కేసును జిల్లా ఎస్పీ ఎం. దీపిక స్వయంగా పర్యవేక్షిస్తూ.. ఎప్పటికప్పుడు చత్తీస్ ఘడ్ పోలీసు అధికారులతో మాట్లాడుతూ, దర్యాప్తు బృందానికి దిశానిర్దేశం చేశారు.

నిందితుడు లోకేష్ శ్రీవాస్ 10వ తరగతి వరకు చదివినట్లు, మొదటి భార్య అనారోగ్యంకు బాగా అప్పులు చేసి, వైద్యం చేయించినప్పటికీ 2014లో చనిపోవడంతో, వాటిని తిరిగి పొందేందుకు తన స్నేహితుల సూచనలతో చోరీలకు పాల్పడుతున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. ఇప్పటి వరకు ఒడిస్సా, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో 11 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని చెప్పారు. నిందితుడి జైలులో ఉన్న సమయంలో శ్రీకాకుళంకు చెందిన ఒక నేరస్థుడితో పరిచయం ఏర్పడి, అతని సలహాతో విజయనగరం పట్టణానికి జనవరి 16న మొదటిసారిగా వచ్చి పద్మజ ఆసుపత్రి లో చోరీకి పాల్పడ్డాడు. అదే విధంగా ఫిబ్రవరి 14న మళ్ళీ మరోసారి వచ్చి సి.ఎం.ఆర్.లో చోరీకి పాల్పడ్డాడు. మళ్ళీ ఫిబ్రవరి 21న విజయనగరం పట్టణం వచ్చి రెక్కీ నిర్వహించి, రవి జ్యూవెలరీ, పాండు జ్యూవెలరీ షాపుల్లో చోరీలకు పాల్పడ్డారన్నారు. ప్రస్తుతం చత్తీస్ ఘడ్ లో సెలూన్ నడుపుకుంటున్నాడని, అతని 2వ భార్య బ్యూటీ పార్లర్ నడుపుతున్నట్లుగా విచారణలో వెల్లడయ్యిందని జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు.

ఈ కేసుల్లో విజయనగరం 1వ పట్టణ సిఐ జె.మురళి, సిసిఎస్ ఇన్స్ పెక్టర్లు సిహెచ్. శ్రీనివాసరావు, ఎస్. కాంతారావు, ఎస్ఐ వి. అశోక్ కుమార్, హెడ్ కాని స్టేబుళ్ళు డి. శంకర్రావు, మహ్మద్ ఇమ్రాన్ ఖాన్, ఎం. అచ్చిరాజులను జిల్లా ఎస్పీ ఎం.దీపిక అభినందించి, ప్రశంసా పత్రాలను, ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేసారు.

Also Read:

యూజీసీ కొత్త ప్రతిపాదనలను విద్యావేత్తలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? కార్పొరేట్లకు రెడ్‌ కార్పెట్ వేయడానికేనా?

భీమ్లా నాయక్ విషయంలో జగన్ నియంతలా ప్రవర్తించారు.. నాదెండ్ల మనోహర్ ఆరోపణలు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu