Andhra Pradesh: కాఫీ తోటలో మూటలు.. తెరిచి చూస్తే కథ వేరే.. ఐడియా మామూలుగా లేదుగా..

అది ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని దట్టమైన అటవి ప్రాంతం.. కొండవాలు ప్రాంతంలో కాఫీ తోట.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి.. గిరిజన కూలీల తప్ప సాధారణ పౌరులు కనిపించని ఆ ప్రాంతంలో ఒక్కసారిగా బూట్ల చప్పుళ్లు మారుమోగాయి. కాఫీ తోటల్లో సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. అక్కడే ఓచోట తోటల మాటున మూటలు కనిపించాయి. వాటిని తెరిచి చూస్తే.. అందులో ఉన్నవి కాఫీ గింజలు కాదు.. ఎండు గంజాయి..! వాళ్ళ ఐడియా చూసి పోలీసులే షాక్ అయ్యారు.

Andhra Pradesh: కాఫీ తోటలో మూటలు.. తెరిచి చూస్తే కథ వేరే.. ఐడియా మామూలుగా లేదుగా..
Ganja Den Busted In Coffee Plantations

Edited By:

Updated on: Apr 30, 2026 | 9:20 PM

అల్లూరి జిల్లా పోలీసుల చేపట్టిన ఆపరేషన్‌లో.. గంజాయి డెన్ బయటపడింది. అది కూడా ఎక్కడో గ్రామంలో కాదు.. ఇంట్లో కూడా కాదు.. ఏకంగా శివారు ప్రాంతంలో ఉన్న ఒక కాఫీ తోటల్లో. ఆపరేషన్ వజ్రప్రహార్‌లో భాగంగా అల్లూరి జిల్లా పోలీసులు పాడేరు ఏజెన్సీలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సెర్చ్ ఆపరేషన్ చేపడుతున్నారు. గంజాయి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని గిరిజనులకు సూచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈగల్ బృందానికి, పోలీసులకు ఒక కీలక సమాచారం అందింది. ఏఓబి లోని ముంచంగిపుట్టు మండలం పాసపుట్టు పంచాయతీ సంగం వలస గ్రామ శివారులో గంజాయి డెన్ ఉన్నట్టు తెలుసుకుని వెళ్లారు. చూస్తే అక్కడ కాఫీ తోటలే కనిపించాయి. తమ వచ్చిన సమాచారం సరైన ఒక సమయంలో అనుమానం కూడా పడ్డారు పోలీసులు. ఒక్కసారిగా అందరూ కలిసి సెర్చ్ ఆపరేషన్ చేశారు. కాఫీ తోటల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. దీంతో ఓ చోట అనుమానాస్పదంగా మూటలు కనిపించాయి. వెళ్లి చెక్ చేయగా.. ఒక్కో మూట తెరిస్తే అందులో గంజాయి గుప్పు మంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా.. 39 మూటలు గుర్తించారు. వాటిలో 749 కిలోల గంజాయి బయటపడింది. కాఫీ తోటల మాటన బయటపడిన ఈ గంజాయితో పోలీసులే షాక్ అయ్యారు. గంజాయి ఘాటు వాసన నుంచి ఎన్ఫోర్స్మెంట్ దృష్టి మరల్చేందుకే కాఫీ తోటల్లో గంజాయి మూటలు పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు.

‘‘పట్టుబడిన గంజాయి విలువ 37.45 లక్షలు ఉంటుందని అంచనా. గంజాయిని అక్కడ ఎవరు నిల్వ చేశారని దానిపై దర్యాప్తు చేస్తున్నాం. నిందితులను త్వరలోనే పట్టుకుంటాం. గంజాయి రహిత జిల్లాగా అల్లూరి జిల్లాను చేయాలనే లక్ష్యంతో ఆపరేషన్ వజ్రప్రహార్ విస్తృతంగా కొనసాగిస్తున్నాం. ప్రజల గంజాయి కి దూరంగా ఉండి.. సహకరించాలి. గంజాయి కార్యకలాపాల్లో ఉంటే చట్టపరమైన చర్యలు తప్పవు’’ అని జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ అన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us