Ambati Rayudu: రాయుడూ నీ దారెటూ..? పవన్‌‌ను కలవడంపై స్పందించిన మాజీ క్రికెటర్

|

Jan 10, 2024 | 10:06 PM

ఇలా పొలిటికల్ అరంగేట్రం చేసి అలా పెవిలియన్‌ చేరాడు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. క్రికెట్‌ బాషలో చెప్పాలంటే హిట్ వికెట్‌లా. క్రికెట్‌లో అనూహ్య, ఆవేశ నిర్ణయాలతో వార్తల్లో నిలిచిన రాయుడు.. రాజకీయాల్లోకొచ్చి అదే అలవాటును కొనసాగించాడు. అసలు అంబటి రాయుడి గోల్‌ ఏంటి? తడ..బ్యాటు వెనుక రీజన్సేంటి?

Ambati Rayudu: రాయుడూ నీ దారెటూ..? పవన్‌‌ను కలవడంపై స్పందించిన మాజీ క్రికెటర్
Ambati Rayudu - Pawan Kalyan
Follow us on

క్రికెట్‌లో అంబటి ఆట అదుర్స్‌. అది టీమిండియాకు ఆడినా.. ఐపీఎల్‌లో ఆడినా.. తనదైన మార్క్ షాట్లతో చెలరేగి పోయేవాడు. ఇంకా బోల్డెంత క్రికెట్ కెరీర్ ఉన్నా.. ఆల్‌ ఆఫ్‌ సడెన్‌గా క్రికెట్‌కి గుడ్‌ బై చెప్పాడు. అంతలోనే పొలిటికల్‌గా ఎంట్రీ ఇచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నాడు అంబటి రాయుడు. గుంటూరు వైసీపీ ఎంపీగా బరిలోకి దిగుతాడని జోరుగా ప్రచారం నడిచింది. అంతలోనే ఏమైందో ఏమో.. పట్టుమని పదిరోజులు కూడా వైసీపీలో కొనసాగకుండానే ఆ పార్టీకి రాజీనామా చేశాడు. త్వరలో దుబాయ్‌ వేదికగా జరగనున్న ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో ఆడనున్నట్లు వెల్లడించాడు అంబటి. అందులో ఆడాలంటే ఏ రాజకీయ పార్టీతో అనుబంధం ఉండకూడదని.. అందుకే వైసీపీకి రాజీనామా చేసినట్లు క్లారిటీ ఇచ్చాడు. ఈ ప్రకటన చేసిన రెండ్రోజులకే జనసేన అధినేత పవన్‌తో భేటీ కావడం ఆసక్తి రేపింది. ఇది మర్యాదపూర్వక భేటీయా..? లేదంటే జనసేనలో చేరుతున్నారా అన్న సస్పెన్స్‌ క్రియేట్ అవుతుండగానే.. కొంతమేర క్లారిటీ ఇచ్చాడు రాయుడు.

“నేను మంచి మనుసుతో ఏపీ ప్రజలకు సేవ చేద్దామనే రాజకీయాల్లోకి వచ్చాను. నా ఆకాంక్షలు నెరవేరతాయనే వైసీపీలో చేరాను. అందుకే చాలా గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను కలుస్తూ.. వారి సమస్యలను విన్నాను. ఎన్నో సామాజిక, సేవా కార్యక్రమాల్లో భాగం అయ్యాను. అయితే వైసీపీలో కొనసాగితే నా ఆశ నెరవేరదేమో అనిపించింది. ఇందులో ఎవర్నీ ఆక్షేపించడానికి లేదు. నా ఆలోచనా ధోరణి.. వైసీపీ భావజాలం విభిన్నంగా ఉంది. అంతేకానీ ఫలానా సీటు కోరడం, ఎలక్షన్స్‌లో పోటీ చేయడం వంటి అంశాల వల్ల నేను బయటకు రాలేదు. రాజకీయాల నుంచి దూరంగా ఉండాలనే అనుకున్నాను. అయితే ఆ నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి పవన్ అన్నను కలవాలని నా మంచి కోరేవారు, మిత్రులు, కుటుంబ సభ్యులు సూచించారు. అందుకే కలిశాను. రాజకీయాలు సహా చాలా అంశాలపై చర్చించా. ఆయన్ను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించా. నా విజన్, ఆయన ఐడియాలజీ ఒకేలా ఉన్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నా. క్రికెట్ కమిటిమెంట్స్ మేరకు దుబాయ్ వెళ్తున్నా. ఏపీ ప్రజల కోసం నిలబడటానికి నేను ఎప్పుడూ సిద్దమే” అని అంబటి రాయుడు స్టేట్మెంట్ రిలీజ్ చేశారు.

అసలు అంబటి రాయుడు దారెటు? ఆయన ఎంచుకున్న రూట్ ఏంటి? వేస్తున్న అడుగులేంటి? ఎందుకీ కన్ఫూజ్యన్? నిజానికి క్రికెటర్‌గా ఎదుగుతున్న సమయంలోనే చాలా నిర్ణయాలు అసంబద్దంగా తీసుకున్నాడు అంబటి. హైదరాబాద్‌ తరపున ఎన్నో రంజీ మ్యాచ్‌లు ఆడాడు. బీసీసీఐ పెద్దల కంట్లో పడే సమయంలోనే అనూహ్యంగా ఆంధ్రాకు షిఫ్ట్ అయ్యాడు. అక్కడ చాలా రంజీ మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత మళ్లీ హైదరాబాద్‌కు షిప్ట్ అయ్యాడు. అంతకుముందు ఇండియన్ క్రికెట్ లీగ్‌లో ఆడి.. ఏకంగా కెరీర్‌నే పణంగా పెట్టాడు.

ఓ వైపు టీమిండియాకు ఆడుతూనే మరోవైపు ఐపీఎల్‌లో సత్తా చాటాడు అంబటి రాయుడు. ఈ క్రమంలోనే వన్డే క్రికెట్‌ కప్‌కి ఎంపిక చేయని కారణంగా నారాజ్ అయ్యాడు. బీసీసీఐ పెద్దలపై ఆగ్రహంతో రగిలిపోయాడు. ట్వీట్లతో వాళ్లను ఏకిపీకి పారేశాడు. అంతటితో ఆగక క్రికెట్‌కి వీడ్కోలు పలుకుతూ నిర్ణయం తీసుకున్నాడు. గత ఏడాది ఐపీఎల్‌కూ గుడ్ బై చెప్పాడు. ఇలా క్రికెట్‌ కెరీర్ ఆసాంతం సడెన్ డెసిషన్స్‌ తీసుకుంటూ టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోయాడు. ఇప్పుడు పాలిటిక్స్‌లో చేరి ఫోర్లు, సిక్స్‌లు కొట్టినంత ఈజీగా నిర్ణయాలు మార్చేసుకుంటున్నాడు. మొత్తానికి రాయుడు కన్ఫ్యూజన్‌ వ్యవహారం ఏపీ పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..