
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీలో ఈతకు వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు ప్రమాదవశాత్తు నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. ధవళేశ్వరం గ్రామానికి చెందిన పెద్దిపాటి హేమంత్ (19),పెద్దిపాటి చెన్ను(16) అనే ఇద్దరు అన్మదమ్ములూ తన స్నేహితుడు మహ్మద్ హసన్ రాజాతో కలిసి సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లారు. గ్రామ సమీపంలోని బ్యారేజీ దిగువన ఇసుక దిబ్బల వద్ద ఉన్న నీటిలో దిగి స్నానం చేస్తూ ఈత కొడుతూ ఉన్నారు.
అయితే ఈ క్రమంలోనే ఈత కొడుతూ హేమంత్ ముందుకు వెళ్లాడు. కానీ అక్కడ లోతు ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తు హేమంత్ నీటిలో మునిగి పోయాడు. అన్నయ్య మునిగిపోతుండటం గమనించిన తమ్ముడు చెన్ను అతన్ని రక్షించేందుకు వెళ్లాడు. కానీ ప్రమాదవశాత్తు తమ్మడు కూడా అన్నతో పాటు నీటిలో మునిగి మృతి చెందాడు. ఇది చూసిన మహ్మద్ హసన్ రాజా భయంతో అక్కడి నుంచి బయటకు వెళ్లి వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చారు.
దీంతో హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు మృతదేహాలను వెలికి తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.